భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులు అదృశ్యమయ్యారు. తమ పిల్లలు ఆదివారం నుండి కనిపించడం లేదని తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై అధికారులు సరిగా స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల గల్లంతు ఘటనపై పాఠశాలలో భద్రతా లోపాలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాచ్మెన్ లేకపోవడం, సీసీ కెమెరాల వంటి కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేకపోవడం విచారకరమని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇద్దరు బాలికల గల్లంతుతో జ్యోతి నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. తల్లిదండ్రులు పిల్లలను సురక్షితంగా కనుగొనాలని అధికారులను వేడుకుంటున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టాలని, పాఠశాల భద్రతా లోపాలను తక్షణమే సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: గోషామహల్‌లో కుంగిన ఐదంస్తుల భవనం..
Follow Us on : Facebook

