కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) సమ్మక్క సారక్క హుండీల్లో కానుకలతో పాటు చిత్ర విచిత్రమైన లేఖలు దర్శనమిస్తున్నాయి. ఆస్తి కోసం ఒకరు.. ప్రేమకోసం మరొకరు, ఉద్యోగం కోసం మరొకరు.. తమ కోర్కెలు తీర్చాలంటూ ఆ తల్లులను వేడుకుంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది ఆ లేఖలపై భక్తులు విచిత్ర కోరికలు చదివి కడుపుబ్బ నవ్వుకుంటున్నారు
మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది. అయితే భక్తులు హుండీలో డబ్బుతో పాటు కొన్నిలేఖలు కూడా వేయడం సిబ్బంది షాక్ అయ్యేలా చేస్తోంది. జాతర హుండీల లెక్కింపులో కొన్ని ప్రేమలేఖలు రావడం, తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్న లేఖలు హుండీలో దర్శనమిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని ఇలా రకరకాలుగా రాసి హుండీలలో వేశారు.
ఓ భక్తుడు తన కొడుకు బారి నుండి కాపాడు అంటూ తల్లిని వేడుకుంటూ 100 రూపాయల నోటు పై తన కోరిక రాసి సమ్మక్క తల్లి హుండీలో వేశాడు. మరో భక్తుడు తన తల్లిదండ్రుల ఆస్తి శివరాత్రి లోపే తనకు దక్కేలా చూడాలని కోరుకుంటూ లేఖ రాసి సమ్మక్క తల్లి హుండీలో వేశాడు. మరో ప్రేమ జంట వాళ్ల ఇరు కుటుంబాలు కలిసి వారిని ఆహ్వానించాలని, ఇరు కుటుంబాలు కలిసి శుభకార్యాలు నిర్వహించాలని కోరుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు లేఖ రాసి అందులో వేశారు.
మరో భక్తుడు వాళ్ల ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యేలా దీవించుతల్లి అని వేడుకుంటూ లేఖలు రాశాడు. వింత వింత కోరికలతో భక్తులు సమ్మక్క సారక్క దేవతల హుండీలో వేసిన ఈ లేఖలు చూసి, సిబ్బంది కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. అయితే ఈ హుండీ లెక్కింపు (Medaram Hundi Counting) ప్రక్రియ మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. అప్పటి వరకు ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి ఉంటోందోనని సిబ్బంది చర్చించుకుంటున్నారు.
Read Also: మహిళకు ఇష్టంలేని గర్భాన్ని కొనసాగించమని ఆదేశించలేం : సుప్రీం
Follow Us On: X(Twitter)


