కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, వర్కింగ్ జర్నలిస్టుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ (Media Accreditation) నిబంధనలు 2025 అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక వెల్లడించారు. ఈ కొత్త నిబంధనలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 22న జారీ చేసిన జిఓఎంఎస్ నెం.252 తో పాటు, జనవరి 24న సవరణలతో కూడిన జిఓఆర్టి నెం.103 ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మీడియా అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులు I&PR శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, కార్డుల జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటేషన్ (Media Accreditation) కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఈ కమిటీలను ఏర్పాటు చేసిన అనంతరం, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అర్హులైన జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేయాలని ప్రత్యేక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన రెండు జీవోలను జిల్లా యంత్రాంగానికి పంపిస్తూ, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: తులం బంగారం ఎప్పుడిస్తారు: వేముల ప్రశాంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


