epaper
Wednesday, February 18, 2026
epaper

పాకిస్తాన్​ కు శ్రీలంక రిక్వెస్ట్!

కలం, స్పోర్ట్స్​​ : భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలన్న పాకిస్థాన్ నిర్ణయం టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)కి వార్నింగ్ కూడా ఇచ్చింది. బ్రాడ్‌కాస్టర్లు కూడా న్యాయపోరాటం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ బోర్డ్ (SCL) పీసీబీకి ఓ లేఖ రాసింది. అందులో భారత్‌తో మ్యాచ్ బాయ్ కాట్​ అంశాన్ని ప్రస్తావించింది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పునర్విచారించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును శ్రీలంక క్రికెట్ కోరింది.

2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ టోర్నమెంట్‌లోనే అతిపెద్ద ఆకర్షణగా గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్ ఆడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని శ్రీలంక క్రికెట్ హెచ్చరించింది. వాణిజ్య ఆదాయం భారీగా తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ కారణంగా ఆశిస్తున్న పర్యాటక రాకలు కూడా ప్రభావితమవుతాయని తెలిపింది.

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే శ్రీలంక క్రికెట్‌కు పెద్ద ఆర్థిక నష్టం జరుగుతుందని పేర్కొంది. ఇది ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాకుండా టోర్నమెంట్‌పై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని విస్తృత దృష్టితో చూడాలని పీసీబీని ఎస్‌ఎల్‌సీ కోరింది. రెండు బోర్డుల మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

క్రికెట్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సమతుల్య నిర్ణయం అవసరమని తెలిపింది. భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న నిర్ణయం పాకిస్థాన్ ప్రభుత్వ స్థాయిలో తీసుకున్నదిగా అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఆ నిర్ణయమే ఈ వివాదానికి నేపథ్యంగా మారింది. ఈ అంశంపై పీసీబీ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో మ్యాచ్ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also: మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులపై దాడి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>