కలం, వెబ్ డెస్క్: డబ్ల్యుపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కల మరోసారి చేజారింది. గురువారం జరిగిన హై–వోల్టేజ్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. ఈ ఓటమితో డీసీకి నాలుగోసారి ఫైనల్‌లో నిరాశ ఎదురైంది. మ్యాచ్ అనంతరం డీసీ కెప్టెన్ జెమిమా (Jemimah Rodrigues) స్పందించారు. ఫైనల్ మ్యాచ్ లో తమ జట్టు ఎంతో పోరాడిందని బలమైన స్కోర్ చేసిందని పేర్కొన్నారు. ఫైనల్‌కు తగ్గ స్కోర్ చేశామన్నారు. ఈ కఠినమైన సీజన్‌లో ఫైనల్ వరకు రావడమే గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు చూపిన ధైర్యం, కమిట్‌మెంట్‌ను ప్రశంసించారు.
ఈ స్థాయికి రావడంలో సపోర్ట్ టీమ్ పాత్ర చాలా కీలకంగా ఉందని జెమిమా ప్రత్యేకంగా గుర్తు చేశారు. సపోర్ట్ టీమ్, లాజిస్టిక్స్ టీమ్ చేసిన కృషి చాలా గొప్పదని కొనియాడారు. స్టేడియంలో అభిమానుల ఉత్సాహం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న DC అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫైనల్‌లో చేసిన స్కోరు సరిపడేదేనని జెమిమా స్పష్టం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో 200 పరుగులు దాటడం గొప్ప విషయమని చెప్పారు. కీలక రోజున జట్టు సమష్టిగా రాణించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
సీజన్ మొత్తాన్ని వెనుదిరిగి చూస్తే ప్రతి ఆటగాడు పూర్తి స్థాయిలో పోరాడాడని జెమిమా (Jemimah Rodrigues) తెలిపారు. సీజన్ ఆరంభంలో ఎదురైన కష్టాల నుంచి జట్టు తిరిగి లేచిన తీరును వివరించారు. నికి, రాణా కీలక మ్యాచ్‌లో చూపిన ఆటను ప్రత్యేకంగా గుర్తు చేశారు. యువ ఆటగాళ్లు అంచనాలను మించి రాణించారని జెమిమా చెప్పారు. నందిని శర్మ బాధ్యతకు మించి ప్రదర్శన ఇచ్చిందని పేర్కొన్నారు. మిన్ను ఫీల్డింగ్‌లో చూపిన చురుకుదనాన్ని కూడా ప్రశంసించారు.
ఈ సీజన్ జట్టుకు విలువైన అనుభవాన్ని ఇచ్చిందని జెమిమా తెలిపారు. యువ ఆటగాళ్లకు నేర్చుకునే అవకాశం లభించిందని చెప్పారు. ఈ ప్రయాణం భవిష్యత్తుకు పునాది అవుతుందని పేర్కొంటూ ఆమె తన మాటలను ముగించారు.
అయితే ఈ మ్యాచ్‌లోముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌కు దిశానిర్దేశం చేశారు. ఆమె 37 బంతుల్లో 57 పరుగులు చేశారు. చివర్లో చినెల్ హెన్రీ 15 బంతుల్లో 35 పరుగులతో స్కోరును భారీగా తీసుకెళ్లారు.
ఫైనల్‌లో 200కు పైగా లక్ష్యం ఉన్నా RCB వెనకడుగు వేయలేదు. కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చారు. ఆమె 41 బంతుల్లో 87 పరుగులతో ఢిల్లీ బౌలర్లను చీల్చారు. మరోవైపు జార్జియా వోల్ 54 బంతుల్లో 79 పరుగులతో నిలకడగా నిలిచారు. రెండు బంతులు మిగిలి ఆర్సీబీ ఛేజ్ పూర్తి చేసింది.


