epaper
Wednesday, February 18, 2026
epaper

పేరు ఏదైతేనేం..? పదవి ఉంటే చాలు..

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీఎన్జీవో (TNGO) పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అనే పదం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదడమే కాదు.. ఎన్జీవోలను, ఉద్యోగులను ఏకం చేసిన సంస్థ. కానీ ఇదంతా చరిత్రగానే మిగిలిపోనున్నది. ఇప్పుడు టీఎన్జీవో పేరు తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్‌గా మారబోతున్నది. ఇందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో (EC) తీర్మానం కూడా జరిగిందని, పేరుతో పాటు ‘బై లా’ కూడా మార్చేందుకు ఆమోదం లభించిందన్నది ఆ సంఘం నేతల వాదన. ఈ మేరకు ప్రభుత్వానికి ఫైల్ కూడా వెళ్ళిందన్నారు. ఈ పేరు మార్పుతో ఇకపైన గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అనే తేడా లేకుండా గవర్నమెంట్ ఆఫీసర్లంతా ఒకే ఎంటిటీగా పనిచేయాలన్నది కొత్త ఫార్ములా. ఉద్యోగుల్లో ఎంతమంది ఈ మార్పును స్వాగతిస్తారనేది భవిష్యత్తు తేల్చనున్నది.

ప్రమాదంలోకి ఎన్జీవో అస్తిత్వం :

ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సిన డిమాండ్లకు ఐక్యంగా పోరాడాలన్నది ఉద్యోగులకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పేరు మార్పుతో గెజిటెడ్ (Gazetted Officers), నాన్-గెజిటెడ్ ఉద్యోగులంతా (Non Gazetted Officers) ఏకమయ్యే సంగతి ఎలా ఉన్నా టీఎన్జీవోలోనే ఈ నిర్ణయంపైనే భిన్నాభిప్రాయాలు, అసమ్మతి సెగలు ప్రారంభమవుతున్నాయి. పేరు మార్చడానికి నిర్దిష్టమైన అవసరమేంటనే అంశంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. పేరు మార్చడమంటే దశాబ్దాల అస్తిత్వాన్ని కోల్పోవడమేనన్నది వందలాది మంది ఎన్జీవోల భావన. ఎన్జీవో సంఘం నేతలుగా ఉన్నవారికి ఇటీవల గెజిటెడ్ ఆఫీసర్లుగా పదోన్నతులు లభించాయి. దీంతో ఎన్జీవో అసోసియేషన్‌లో కంటిన్యూ కావడానికి లీగల్ చిక్కులు తప్పడంలేదు. కానీ నాయకత్వ బాధ్యతలను వదులుకోడానికి సిద్ధంగాలేకపోవడంతో పేరు మార్పుతో పాటు ‘బై లా’ను కూడా మార్చేయాలనే నిర్ణయానికి వచ్చారన్నది ఉద్యోగుల వాదన.

సబార్డినేట్ రూల్స్ వర్తింపు కోసం పేరు మార్పు :

ఎన్జీవోలకు ప్రత్యేకంగా సబ్ ఆర్డినేట్ రూల్స్ ఉంటాయి కాబట్టి పేరు మార్చినా లీగల్ చిక్కులు రావన్నది ఆ సంఘం నేతల వాదన. కానీ గెజిటెడ్ ఆఫీసర్ల విషయంలో అలాంటి నిర్దిష్టమైన రూల్స్ ఉండవని, అందువల్లనే టీఎన్జీవో పేరు మారినా సబార్డినేట్ రూల్స్ వర్తించేలా లీగల్ చిక్కుల్లేకుండా మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారన్నది మరో వాదన. ఆ కారణంగానే గెజిటెడ్ ఆఫీసర్ల అనే భావన రాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ అనే పేరును పెట్టాలనే నిర్ణయం. గెజిటెడ్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చిన తర్వాత టీజీవో (TGO) యూనియన్‌లో చేరితే కేవలం సభ్యులుగానే కొనసాగాల్సి ఉంటుంది. టీఎన్జీవో (TNGO) యూనియన్ నేతలుగా వారి పెత్తనం, పదవి పోతుంది. ఈ బాధతోనే పేరు, ‘బై లా’ మార్చాలన్న తతంతగం నడుస్తున్నదనేది ఎన్జీవోల వాదన. ఏకకాలంలో రెండు సంఘాల్లో సభ్యత్వం సాధ్యం కానందున ఈ కసరత్తుకు శ్రీకారం చుడుతున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి. పిడికెడు మంది వారి పదవుల కోసం సంఘం పేరునే మార్చేస్తారా?.. అనే ఆగ్రహం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరగనున్నదో !

Read Also: కాడెత్తేసిన కారు.. ‘మున్సిపోల్స్’ సభల్లేవ్.. సందడి లేదు..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>