కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) గెలుపుపై బీఆర్ఎస్ ఆశలు వదులుకున్నదా?.. ఫోన్ ఎంత ప్రచారం చేసినా ఫలితం లేదని నీరుగారిపోయిందా?.. ఇన్‌చార్జిలు చూసుకుంటారని వారికే వదిలేసిందా?.. ఎలాగూ ఓడిపోక తప్పదనే అంచనాతో బహిరంగసభలు వద్దనుకున్నదా?.. ట్యాపింగ్ ఉచ్చులో చిక్కుకుపోయిందా?.. ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్ని వెంటాడుతున్నది. రాష్ట్రంలో కనీసంగా 35 చైర్‌పర్సన్ స్థానాలను గెల్చుకుంటామని మొదట్లో ధీమా వ్యక్తం చేసినా ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. పార్టీ అధినేత ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల జిల్లా మీద ఫోకస్ పెట్టారు. సీనియర్ నేత ఉమ్మడి మెదక్ జిల్లాపై కేంద్రీకరించారు. మిగిలిన చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి పార్టీ చేతులు దులుపుకున్నది.
సభల్లేవ్.. సందడీ లేదు :
పంచాయతీ ఎన్నికల్లో ఆశించినదానికంటే ఎక్కువ ఫలితాలే వచ్చాయని బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ 60% సీట్లు సాధించలేకపోయిందని కామెంట్ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు బహిరంగసభలతో హడావిడి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడమే వారికి మింగుడు పడడంలేదు. ఎవరికి వారే యమునాతీరే.. చందంగా పార్టీని లీడ్ చేయడంలో నేతలు దూరదృష్టితో లేరనే అభిప్రాయం వినిపిస్తున్నది. డబ్బుల ఖర్చుకు వెనకాడుతున్నారా?.. లేక ఎలాగూ గెలిచే చాన్స్ లేదనే భావనతో ఖర్చును తగ్గించుకుందామనుకుంటున్నారా?.. గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్తారనే అనుమానంతో హడావిడి చేయడంలేదా?.. ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నందుకే ఈ ఆలోచనా? :
అధికారంలో ఉన్నప్పుడు ఎంతో హడావిడి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నదే ఆ పార్టీ కేడర్‌ను విస్మయానికి గురిచేస్తున్నది. అప్పుడున్న స్పిరిట్ ఇప్పుడు పార్టీలో కనిపించడంలేదన్నది వారి భావన. ప్రారంభంలో వార్డు స్థాయిలోనే ఫంక్షన్ హాళ్లలో ఐదారువేల మందితో కార్యకర్తల మీటింగులను పెట్టాలనుకుని ఆ తర్వాత మనసు ఎందుకు మార్చుకున్నారనే అయోమయం వారిని వెంటాడుతున్నది. చివరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి పార్టీ చేతులు దులుపుకున్నది. ఇప్పటివరకు భారీ బహిరంగసభలకు పార్టీ ప్లాన్ చేయలేదు. పార్టీ సింబల్‌పైన ఎన్నికలు (Municipal Elections) జరుగుతున్నా పక్కా కార్యాచరణతో కేడర్‌ను జిల్లా స్థాయి నేతలను కదిలించడంలో విఫలమైంది.
పార్టీ కెపాసిటీ ఎంతో తెలిసేది గదా.. ! :
నిజంగా కొట్లాడితే గెలిచే ఛాన్స్ ఉన్నా ఎందుకు చేజార్చుకుంటున్నదనేది పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నది. నేతలంతా సమిష్టిగా రంగంలోకి దిగి కదిలితే, కేడర్‌లో ఉత్సాహం నింపితే పార్టీ సత్తా ఏంటో తెలిసేది గదా అనేది వారి ఉద్దేశం. ప్రజల్లో పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం దక్కేదని, ఈ ఉత్సాహంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కేడర్‌లో జోష్ నింపడానికి దోహదపడేదన్నది వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. అలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుందన్న ఆవేదన కనిపిస్తున్నది. మరో నాలుగు రోజులే ప్రచారం ఉన్నా హరీశ్‌రావు, కేటీఆర్ వారివారి జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నారని, రాష్ట్రమంతా తిరిగి క్యాంపెయిన్ చేసే స్టార్ లీడర్లు కరువయ్యారన్న నీరస కేడర్‌లో కనిపిస్తున్నది. అసలు పార్టీలో ఏం జరుగుతున్నదనే సందేహాలు కనిపిస్తున్నాయి.
Read Also: తెలుగు స్టేట్స్ లో వివాదాస్పదంగా DGPల నియామకాలు
Follow Us On: Instagram


