epaper
Wednesday, February 18, 2026
epaper

తెలుగు స్టేట్స్ లో వివాదాస్పదంగా DGPల నియామకాలు

కలం, తెలంగాణ బ్యూరో : డీజీపీల నియామకంపై తెలంగాణలో మాత్రమేకాక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వివాదాలున్నాయి. సుప్రీంకోర్టు 2006లో ప్రకాష్ సింగ్ కేసులో వెలువరించిన తీర్పును అమలు చేయకుండా, రాష్ట్రాలు వాటికి నచ్చిన అధికారులను ‘యాక్టింగ్ డీజీపీ’లుగా, తాత్కాలిక డీజీపీలుగా నియమించుకోవడం వివాదాలకు దారితీసింది. ఫుల్ టైమ్ డీజీపీ నియామకానికి యూపీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలే ఇచ్చింది. కానీ వాటిని బేఖాతర్ చేయడం అనేక రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీగా మారింది. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేసుకున్నాయి. ఏ చట్టం చేసుకున్నా అది సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉండాలన్నది నిబంధన. కానీ రాష్ట్రాలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. నివారణకు ఇకపైన యూపీఎస్సీకి అధికారాన్ని కట్టబెట్టకతప్పదని తాజాగా హెచ్చరించింది.

ఆ 4 రాష్ట్రాల్లో ఇలా..

డీజీపీల నియామకం నిబంధనల మేరకు జరగలేదని అనేక రాష్ట్రాలపై ఆరోపణలు వచ్చాయి. ఇవి సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి.

తమిళనాడు: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వెంకట్రామన్ను యాక్టింగ్ డీజీపీగా నియమించడంపై కోర్టు ధిక్కరణ నోటీసులను సుప్రీంకోర్టు జారీచేసింది. ‘‘యాక్టింగ్ డీజీపీ అనే కాన్సెప్ట్ చట్టంలో ఎక్కడా లేనే లేదు’’ అని మందలించింది.

పశ్చిమబెంగాల్: యూపీఎస్సీ పంపిన ప్యానెల్ను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం సొంత చట్టం ప్రకారం డీజీపీని నియమించుకోవడానికి ప్రయత్నించడంతో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని నిలిపేసింది.

ఉత్తరప్రదేశ్: కొన్నేండ్లుగా నలుగురు డీజీపీలు తాత్కాలిక ప్రాతిపదికపైనే అపాయింట్ అయ్యారు. సీనియారిటీలో 19వ స్థానంలో ఉన్న ప్రశాంత్కుమార్ను యాక్టింగ్ డీజీపీగా నియమించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం,
ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంజాబ్: డీజీపీగా ఉన్న విరేష్ భవ్రాను తొలగించి గౌరవ్ యాదవ్ అనే ఆఫీసర్ను యాక్టింగ్ డీజీపీగా నియమించడంతో సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. నిబంధనల ప్రకారం యూపీఎస్సీకి ప్యానెల్ను పంపకుండా తాత్కాలిక నియామకం చేయడాన్ని తప్పు పట్టింది.

వివాదాలకు కారణాలేంటి?

రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి విధేయులుగా ఉండే అధికారులను డీజీపీగా నియమించుకోవాలని కోరుకుంటాయి. యూపీఎస్సీ నిబంధనలతో నచ్చినవారికి పోస్టులు రావనే కారణంగా సొంత చట్టాల వైపు రాష్ట్రాలు పరుగులు తీస్తున్నాయి. అందుకే ఇన్చార్జ్ పేరుతో బాధ్యతలు ఇచ్చి నెలల తరబడి కొనసాగిస్తుంటాయి. అర్హులైన అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి సమయాన్ని వృథా చేస్తాయని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. దీంతో అర్హులైన, సీనియర్, మెరిట్ ఉన్న అధికారులకు అవకాశాలు చేజారుతున్నాయని పేర్కొన్నది.

సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది?

ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక డీజీపీని నియమించవద్దని, పోలీస్ బాస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా తప్పనిసరిగా పూర్తిస్థాయి అధికారి ఉండాలని 2018లోనే సుప్రీంకోర్టు జడ్జి దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించుకున్నట్లయితే అవి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడే ఉండాలని, విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని స్పష్టం చేశారు. డీజీపీగా ఎంపికయ్యే ఆఫీసర్ కనీసంగా ఆ పోస్టులో ఆరు నెలల పాటు పనిచేసేలా సర్వీసు మిగిలి ఉండాలని కూడా 2019లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విరుద్ధంగా పోతే ఏం జరుగుతుంది?

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు.. రిటైర్మెంట్కు వారం రోజుల ముందు డీజీపీ నియామకాలు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత సర్వీసు పొడిగింపు పేరుతో రెండేండ్ల దాకా ఆ పోస్టుల్లో వారిని ఇన్చార్జ్, ఫుల్ అడిషనల్ చార్జ్ పేరుతో కొనసాగిస్తున్నాయి. ఇది యూపీఎస్సీ రూపొందించిన గైడ్లైన్స్ స్ఫూర్తికి విరుద్ధం మాత్రమే కాక జవాబుదారీతనం లోపిస్తుందన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగే ఈ నియామకాలపై యూపీఎస్సీకి కోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉన్నది. నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరే అవకాశమూ ఉన్నది.

రాష్ట్ర చట్టంతో మహేందర్రెడ్డి!

తెలంగాణలో డీజీపీ నియామకం కోసం 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. రాష్ట్ర డీజీపీ నియామకంలో కేంద్ర ప్రభుత్వం లేదా యూపీఎస్సీ జోక్యం లేకుండా సొంతంగా నియమించుకోవాలనేదే ప్రధాన ఉద్దేశం. అప్పటి గవర్నర్ నుంచి 2018 మార్చి 29న ఆమోదం పొందడంతో ఆ మరుసటి రోజు నుంచే అమల్లోకి వచ్చింది. యూపీఎస్సీతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఒక కమిటీ వేసుకుని డీజీపీగా ఒక అధికారిని ఎంచుకునే వెసులుబాటు లభించింది. ఆ ప్రకారం మహేందర్రెడ్డి ఫుల్ టైమ్ డీజీపీగా నియమితులై ఐదేండ్ల పాటు కొనసాగారు. అప్పటివరకూ ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం యూపీఎస్సీ ఆమోదం, జోక్యం తప్పనిసరి అనే నిబంధన పాటించాల్సిన అవసరం లేకుండాపోయింది.

శివధర్ రెడ్డి ఇష్యూ 4 వారాల్లో తేల్చాల్సిందే!

శివధర్రెడ్డిని డీజీపీగా నియమిస్తూ కాంగ్రెస్ సర్కార్ గతేడాది సెప్టెంబర్ లో నిర్ణయం తీసుకున్నది. దీన్ని సవాల్ చేస్తూ ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్చార్జ్ డీజీపీల నియామకంపై యూపీఎస్సీ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉటంకించి ఆయన నియామకాన్ని సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ఈ వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. నాలుగు వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను నిబంధనల మేరకు కంప్లీట్ చేయాలని యూపీఎస్సీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. ఈ నెల చివరకు స్పష్టత రానున్నది.

12 ఏళ్లలో తెలంగాణలో ఇదీ పరిస్థితి..!

తెలంగాణలో ఎలాంటి వివాదం లేకుండా నియమితులైన ఏకైక డీజీపీ అనురాగ్శర్మ. 2015లో యూపీఎస్సీ ఆమోదంతో జరగ్గా 2017 వరకు కొనసాగారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న ప్రత్యేక చట్టం ద్వారా డీజీపీగా మహేందర్రెడ్డి నియమితులై ఐదేండ్ల పాటు కొనసాగారు. ఈ చట్టం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమంటూ అప్పట్లోనే పిటిషన్లు దాఖలయ్యాయి. యూపీఎస్సీకి ప్యానెల్ పంపకుండా ‘ఇన్చార్జ్’ లేదా ‘అదనపు బాధ్యత’లతో డీజీపీలను కొనసాగించడం ప్రకాష్ సింగ్ తీర్పును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహేందర్రెడ్డి రిటైర్ అయిన తర్వాత అంజనీకుమార్ డీజీపీ అయ్యారు. ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో రవిగుప్త ఇన్చార్జ్ డీజీపీ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత జితేందర్ ఎఫ్ఏసీ పేరుతో కొనసాగారు. ఆయన కూడా పదవీ విరమణ చేయడంతో గతేడాది అక్టోబర్ నుంచి శివధర్రెడ్డి డీజీపీగా కొనసాగుతున్నారు.

యూపీఎస్సీ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపే అధికారుల జాబితాను యూపీఎస్సీ ఒక ఎంపానెల్మెంట్ కమిటీ ద్వారా పరిశీలిస్తుంది. యూపీఎస్సీ చైర్పర్సన్ లేదా మెంబర్, కేంద్ర హోంశాఖ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ చేస్తుంది. డీజీపీ పోస్టుకు ఎంపికయ్యే అధికారికి 30 ఏళ్ల ఐపీఎస్ సర్వీసు ఉండాలి. ఆ అధికారి తప్పనిసరిగా డీజీ ర్యాంకులో లేదా ఆ ర్యాంకుకు పదోన్నతి పొందే అర్హతతో ఉండాలి. ప్యానెల్ రెడీ అయ్యేనాటికి ఆ ఆఫీసర్కు ఇంకా ఆరు నెలల సర్వీసు ఉండాలి. గడచిన పదేండ్ల సర్వీసులో వారి పనితీరు వెరీ గుడ్ లేదా ఔట్స్టాండింగ్ అయి ఉండాలి. ఈ అర్హతలు లేని అధికారులను యూపీఎస్సీ ఆ జాబితా నుంచి తొలగిస్తుంది.

ఫుల్టైమ్ డీజీపీ రేసులో ఉన్నదెవరు?

– తెలంగాణలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్లతో కూడిన లిస్టును పంపింది.
– ఈ ప్యానెల్లో 1991 బ్యాచ్ ఐపీఎస్ సీవీ ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్రెడ్డి, సౌమ్యామిశ్రా, శిఖాగోయల్ పేర్లున్నాయి.
– శివధర్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో రిటైర్ కానున్నారు. యూపీఎస్సీ నిబంధన ప్రకారం కనీసం ఆరు నెలల సర్వీసు తప్పనిసరి. నాలుగు వారాల్లో డీజీపీ అపాయింట్మెంట్ ఇష్యూను ఫైనల్ చేయాలంటూ యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ తర్వాత తక్కువ సర్వీసే ఉన్న శివధర్రెడ్డి డీజీపీగా కొనసాగుతారా?.. లేదా?.. అనే అంశంపై క్లారిటీ రానున్నది. వివాదాలున్నా ఐదు నెలలుగా శివధర్రెడ్డి డీజీపీగానే కొనసాగుతున్నారు.

ఏపీలోనూ 11 ఏండ్లుగా వివాదం

ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 ఏళ్లుగా సరైన ప్యానెల్ను యూపీఎస్సీకి పంపకుండానే డీజీపీల నియామకాలు జరిగాయి. ఇటీవల యూపీఎస్సీ జోక్యంతో మళ్లీ గాడిలో పడింది. ఫస్ట్ ఇన్చార్జ్ డీజీపీగా జేవీ రాముడు 2014లో నియమితులైనా ఫుల్టైమ్ డీజీపీగా ఖరారు చేసినప్పుడు అభ్యంతరాలొచ్చాయి. ఆ తర్వాత ఎన్.సాంబశివరావు 2016లో యాక్టింగ్ డీజీపీగా అపాయింట్ అయ్యారు. యూపీఎస్సీకి ప్యానెల్ పంపడంలో ఆలస్యమైనా ఆ తర్వాత వెనక్కి వచ్చింది. రిటైర్మెంట్కు కొన్ని రోజుల ముందు ఫుల్టైమ్ డీజీపీ హోదా దక్కింది. ఆ తర్వాత ఆర్పీ ఠాకూర్ నియమితులైనప్పుడు సీనియర్లను పక్కన పెట్టడం వివాదాస్పదమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల టైమ్లో ఈసీ జోక్యంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. గౌతమ్ సవాంగ్ డీజీపీ అయ్యారు. కానీ ఆయనను ప్రభుత్వం తొలగించింది. రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్చార్జ్, ఎఫ్ఏసీ డీజీపీగా బాధ్యతలు తీసుకోవడంపై హైకోర్టు ఫైర్ అయింది. దీంతో 2024 ఎన్నికల టైమ్లో ద్వారకా తిరుమలరావు డీజీపీ అయ్యారు. ఇటీవలే యూపీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం డీజీపీ నియమించే ప్రాక్టీస్ ఏపీలో మళ్లీ మొదలైంది.

కచ్చితంగా యూపీఎస్సీ ద్వారానే…

పోలీసు అంశం స్టేట్ సబ్జెక్ట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల బాట ఎంచుకున్నాయి. అయినా డీజీపీ నియామకం తప్పనిసరిగా యూపీఎస్సీ ప్యానెల్ ద్వారానే జరగాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ప్రకాశ్సింగ్ కేసులో వెలువరించిన తీర్పునే అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేస్తున్నది. రాష్ట్రాలు చేసుకునే చట్టాలేవైనా ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఉండాలన్నది ఉన్నత న్యాయస్థానం వాదన. ఒకవేళ విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని నొక్కిచెప్పింది. డీజీపీల నియామకం కోసం షెడ్యూలు ప్రకారం రాష్ట్రాలు అర్హులైన ఆఫీసర్ల జాబితాను యూపీఎస్సీకి పంపాలి. జాప్యం చేసినట్లయితే నేరుగా సుప్రీంకోర్టును యూపీఎస్సీ ఆశ్రయించవచ్చని తాజాగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలే డీజీపీల నియామకంలో ‘సుప్రీం’.

Read Also: మేడారం జాతరలో బాలిక పై లైంగికదాడి జరగలేదు : మహిళా కమిషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>