కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) లో సిట్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలతో పాటు, గతంలో ఆ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులకు సిట్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ కొణతం దిలీప్ కి సన్నితుడిగా ఉన్న సామ్రాట్ అనే వ్యక్తికి సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. రేపు (శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) కు సంబంధించి సీఆర్పీసీ 160 కింద వివరణ ఇవ్వాల్సిందేనని పోటీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా విభాగంలో కొణతం దిలీప్ కీలక పాత్ర పోషించారు. ఆయన టీమ్ లో సామ్రాట్ అనే వ్యక్తి పని చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇటీవల పలు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెట్టడంతో వాటికి సంబంధించిన వివరాలు ఆధారాలు రాబట్టేందుకే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కీలక దశకు చేరడంతో రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరికి నోటీసులు అందుతాయనేది ఆసక్తిగా మారింది.


