కలం, వెబ్ డెస్క్ : రాజ్యసభలో (Rajya Sabha) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాలకు కనీస అవగాహన లేదని విమర్శించిన ఆయన, సభలో చర్చ జరుగుతున్నప్పుడు హుందాగా వ్యవహరించాల్సింది పోయి అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన తనను తాను ఒక చక్రవర్తిలా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాలు సభలో నిలబడలేక, అలసిపోయి మధ్యలోనే వెళ్లిపోయాయని మోడీ పేర్కొన్నారు. మా ఆలోచనలకు, కాంగ్రెస్ ఆలోచనలకు భూమి, ఆకాశమంతా తేడా ఉందని తెలిపారు.
గత యూపీఏ (UPA) ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు చాలా సమయం పట్టిందని ప్రధాని వివరించారు. ముఖ్యంగా గత పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ఎన్‌పిఏలు విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ధైర్యంగా సంస్కరణలు చేపట్టి, గతంలో ఎన్నడూ బ్యాంకుల గడప తొక్కని సామాన్యులకు కూడా రుణాలు అందేలా చేశామని తెలిపారు. ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 9 దేశాలతో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుందని, గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో అక్కడ యువత భవిష్యత్తు అంధకారంలో ఉందని ప్రధాని తెలిపారు. టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దేశ రైతులను దారుణంగా మోసం చేసిందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోడీ (Narendra Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’
Follow Us On : WhatsApp


