నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’

కలం, తెలంగాణ బ్యూరో : డీజీపీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (UPSC) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం గతంలో పంపిన డీజీపీ ప్యానెల్ లిస్టు ప్రతిపాదనలను సమర్ధించింది. అప్పట్లో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ అంశంపై విచారణ జరిపి వెలువరించిన తీర్పుకు పలు మార్పులు చేసి సవరించింది. ఇకపైన రాష్ట్రాలు డీజీపీల నియామకంలో (DGP Appointment) అర్హులైన ఆఫీసర్ల జాబితా పంపితే ఆలస్యం లేకుండా యూపీఎస్సీ సత్వరం నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో సీనియారిటీ ఉన్న అధికారులకు అవకాశాలు చేజారుతాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు (Supreme) ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. డీజీపీ నియమాక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం విషయంలో కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇకపైన రాష్ట్రాలు అలా వ్యవహరించకుండా యూపీఎస్సీ జోక్యం చేసుకోవాలని సూచించింది. నిర్దిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు డీజీపీల నియామకానికి (DGP Appointment) సంబంధించి ప్రతిపాదనలు పంపని పక్షంలో యూపీఎస్సీ నేరుగా లేఖలు రాయవచ్చని, ఆ వెసులుబాటును తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించని పక్షంలో సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ నేరుగా కోర్టులోనే అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చని స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సమయానికి ప్రతిపాదనలు పంపకపోతే ఆ రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జవాబుదారీతనం ఉండేలా సుప్రీంకోర్టే స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుందని చీఫ్ జస్టిస్ బెంచ్ హెచ్చరించింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్లో తప్పు లేకపోయినా ఈ పిటిషన్‌ను అప్పట్లో సింగిల్ బెంచ్ విచారించడంపై చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సహజంగా ఇలాంటి కీలకమైన కేసుల్లో సీనియర్ న్యాయమూర్తులు విచారణ జరపాల్సి ఉంటుందని సూచించారు.

Read Also: మేడారంలో లైంగిక దాడి ఆరోప‌ణ‌ల‌పై మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>