కలం, వెబ్ డెస్క్: ఈ-కామర్స్ (E commerce) ఎగుమతులపై చాలా కాలంగా ఉన్న సందిగ్ధతకు ప్రభుత్వం తాజాగా తెరదించింది. కొరియర్ ద్వారా జరిగే వాణిజ్య ఎగుమతుల విషయంలో కీలక సంస్కరణలను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కొరియర్ మోడ్‌లో వాణిజ్య సరుకుల ఎగుమతులకు ఉన్న రూ.10 లక్షల విలువ పరిమితిని ప్రభుత్వం రద్దు చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి విలువ ఉన్న సరుకులనైనా కొరియర్ ద్వారా ఎగుమతి చేసే అవకాశం కల్పించారు. దీంతో అధిక విలువ, తక్షణ అవసరాలున్న సరుకుల ఎగుమతుల్లో కొరియర్ సేవలకు విమాన కార్గోతో సమాన స్థానం లభించింది.
ఈ మార్పు వల్ల MSMEs, స్టార్టప్స్, D2C బ్రాండ్లు, కొరియర్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ-కామర్స్ ఆధారిత ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, గ్లోబల్ ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతి విధానాన్ని సరిపోల్చడమే ఈ సంస్కరణల లక్ష్యమని అధికారులు తెలిపారు. కొరియర్ ద్వారా పరిమితుల్లేని ఎగుమతులతో ఎగుమతిదారులకు మరింత ఫ్లెక్సిబిలిటీ లభిస్తుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ- కామర్స్ (E commerce) సంస్థలకు లబ్ధి చేకూరనున్నది.
ఇదే సమయంలో అంతర్జాతీయంగా డెలివరీ కాకుండా మిగిలిపోయే కొరియర్ పార్సెల్స్‌కు రిటర్న్ టు ఆరిజిన్ (Return To Origin) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల కస్టమ్స్ గోదాముల్లో రద్దీ తగ్గుతుందని, మళ్లీ మళ్లీ జరిగే వేలాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే విధంగా రిటర్న్ అయ్యే సరుకులను డిజిటల్‌గా ఎగుమతి డేటాతో సరిపోల్చనున్నారు. ప్రమాద సూచనలు ఉన్న సందర్భాల్లో మాత్రమే భౌతిక తనిఖీలు ఉంటాయని చెప్పారు. అయితే తిరిగి వచ్చిన సరుకులపై పొందిన ఎగుమతి ప్రోత్సాహకాలను రద్దు చేస్తారని స్పష్టం చేశారు.
ఆభరణాల ఎగుమతులపై ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో ఎగుమతి లాజిస్టిక్స్ మరింత సులభమవుతాయని, చిన్న ఎగుమతిదారులకు గ్లోబల్ మార్కెట్లలో అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: టాక్సీ రంగంలో కొత్త విప్లవం.. ఢిల్లీలో ‘భారత్ టాక్సీ’ సేవలు షురూ, తక్కువ ధరకే రైడ్స్
Follow Us On: Youtube


