epaper
Monday, November 17, 2025
epaper

రిజైన్ చేయనున్న దానం నాగేందర్ ?

కలం డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) త్వరలో రాజీనామా చేయనున్నారా?.. ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానున్నదా?.. కాంగ్రెస్ బీ-ఫామ్ మీదనే ఆయన పోటీ చేయనున్నారా?… ఈ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళనున్నదా?.. వీటన్నింటికీ ఆ పార్టీ వర్గాల నుంచి ‘ఔను’ అనే సమాధానం వస్తున్నది. పార్టీ ఫిరాయింపు కారణంతో ఆయనపై అనర్హత వేటు పడకముందే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరోసారి అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే నిర్దిష్ట ఫార్మాట్‌లో అసెంబ్లీ స్పీకర్‌కు రిజిగ్నేషన్ పంపించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నది.

ఫిరాయింపు వేటు పడకుండా.. :

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్(Danam Nagender) ఆ తరవాత ఆరు నెలలకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్ మీద సికింధ్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగడం పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కానీ ఆ దిశగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియపై స్పీకర్ చర్యలు మొదలుపెట్టారు. ఆయన నిర్ణయం తీసుకోకముందే రిజైన్ చేయడం ఉత్తమం అని దానం నాగేందర్ నిర్ణయించుకున్నట్లు సన్నిహితుల సమాచారం.

ఈసారి కాంగ్రెస్ బీ-ఫామ్ తో రంగంలోకి :

రిజైన్ చేయడంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఈసారి కాంగ్రెస్ బీ-ఫామ్ మీద పోటీ చేయాలని దానం నాగేందర్ భావిస్తున్నారు. మరోసారి గెలుపు ఖాయమని ఆయనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్నది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనప్పటికీ గెలిచినందున ఖైరతాబాద్ సైతం గెలుస్తామన్నది వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం. పార్టీ కూడా ఇదే భావనతో ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఖాతాలోకి రావడంతో ఖైరతాబాద్‌ను సైతం ఆ జాబితాలోకి తెచ్చుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. జూబ్లీహిల్స్ గెల్చుకోడానికి కాంగ్రెస్ అనుసరించిన సమిష్టి కృషి, పకడ్బంధీ వ్యూహానికి తగినట్లుగా ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో సైతం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నది.

బీఆర్ఎస్‌ను, కేటీఆర్‌ను వీక్ చేసే ప్లాన్ :

గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు తిరుగు లేదని, నగర ప్రజలు తమతోనే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సైతం అదే ధీమాను వ్యక్తం చేశారు. కానీ డామిట్.. కథ అడ్డం తిరిగింది… తరహాలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈసారి ఖైరతాబాద్ విషయంలో సైతం అదే తీరులో బీఆర్ఎస్‌ను ఓడించాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఆ ప్రకారం గ్రేటర్ పరిధిలో అటు బీఆర్ఎస్ బలహీనమనవుతున్నదని, కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు స్వీకరించడంలేదని ప్రజలకు ఒక మెసేజ్ పంపాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందువల్లనే ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో సైతం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకేసారి అటు బీఆర్ఎస్‌కు, ఇటు కేటీఆర్‌కు ఝలక్ ఇవ్వాలని కోరుకుంటున్నది.

Read Also: ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు షాక్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>