epaper
Wednesday, February 18, 2026
epaper

మీరు పైసలిస్తే మేం సర్వే చేస్తాం.. సమ్మక్క బ్యారేజీపై చత్తీస్‌గఢ్

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సాగర్ (Sammakka Sagar Project) ప్రాజెక్టు కారణంగా చత్తీస్‌గఢ్‌లో తలెత్తే ముంపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వ చేయనున్న అధ్యయనానికి తెలంగాణ సర్కార్ నిధులివ్వాలని ఆశిస్తున్నది. థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ఏజెన్సీ (Consultancy Agency) ద్వారా జరిపే ఈ అధ్యయనానికి సుమారు రూ. 9.88 కోట్ల మేర అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ డబ్బును సమకూర్చాల్సిందిగా తెలంగాణ ఇరిగేషన్ డిపార్టుమెంటు (Telangana I&CAD) ముఖ్య కార్యదర్శికి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ లేఖ రాశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ద్వారా చత్తీస్‌గఢ్‌లో ఎన్ని గ్రామాలు ముంపు (Submergence) ప్రమాదంలోకి వెళ్తాయి… ఎన్ని ఎకరాల మేర భూమికి నష్టం జరుగుతుంది.. బ్యాక్ వాటర్ (Back Water) ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. నిర్వాసితులయ్యే ప్రజలు ఎందరు.. ఎన్ని రూపాల్లో ప్రజలు వారి ఆస్తుల్ని నష్టపోతారు.. వారి ఆవాసాలకు జరిగే నష్టం విలువ ఎంత… ఇలాంటి అంశాలను ఆ ఏజెన్సీ అధ్యయనం చేయనున్నది.

ప్రాజెక్టు నిర్మాణానికి చత్తీస్‌గఢ్ అనుమతి తిప్పలు :

అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదంగా (Inter State Water Dispute) మారకుండే ఉండేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారం అనివార్యం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కానీ రిజర్వాయర్‌లో నీటి నిల్వ కారణంగా చత్తీస్‌గఢ్ (Chattisgarh) రాష్ట్రానికి చెందిన కొన్ని గ్రామాలు ముంపు బారిన పడతాయి. అక్కడి ప్రజలు జీవనాధారం కోల్పోయి నిరాశ్రయులవుతారు. భూమికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి పునరావాసానికి సైతం ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయడం తప్పనిసరి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాలపై స్టడీ చేసి రిపోర్టు సిద్ధం చేసింది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సైతం అధ్యయనం చేసి నివేదికను రూపొందించనున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు కారణంగానే ఇది అవసరమవుతున్నందున థర్డ్ పార్టీ ఏజెన్సీకి అయ్యే ఖర్చును కూడా భరించాలన్నది ఆ రాష్ట్ర వాదన.

ఎఫ్ఆర్ఎల్ నిర్ధారణపై కసరత్తు :

సమ్మక్క ప్రాజెక్టు (Sammakka Sagar Project) ఫుల్ రిజర్వాయర్ లెవల్ (FRL) నిర్ధారణ అయితే దానికి అనుగుణంగా చత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఎన్ని గ్రామాలు, ఎన్ని ఎకరాల సాగుభూములకు నష్టం జరుగుతుందనే స్పష్టత వస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అంగీకారం మేరకు మొత్తం పరిహారాన్ని తెలంగాణ చెల్లించనున్నది. దీన్ని స్టడీ చేసి పూర్తి వివరాలతో నివేదిక తయారైన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం, పునరావాసం తదితరాలకు చెల్లించాల్సి ఉంటుందనేది తేలనున్నది. స్టడీ, సర్వే తదితర పనులకు సుమారు రూ. 9.88 కోట్ల మేర ఖర్చు కానున్నందున ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వగానే పనులు స్టార్ట్ అవుతాయని చత్తీస్‌గఢ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read Also: పీఆర్సీ.. రెండున్నరేళ్లు దాటినా నో ప్రోగ్రెస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>