epaper
Wednesday, February 18, 2026
epaper

పీఆర్సీ.. రెండున్నరేళ్లు దాటినా నో ప్రోగ్రెస్

కలం, తెలంగాణ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ (Pay Revision Commission) ఇంకా ఆమడదూరం అన్నట్లుగా ఊరిస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్‌గా గత ప్రభుత్వంలో ఏర్పాటైన పీఆర్సీ రెండున్నరేండ్లుగా పనిచేస్తూనే ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో 2023 అక్టోబరు 2న లాంఛనంగా ఈ కమిషన్ ఏర్పాటైంది. ఆ ఏడాది జూలై నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సిన వేతన సవరణల (Telangana PRC) కోసం తగిన సిఫారసులు ఇవ్వాలని ఈ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు నెలల గడువు విధించినా వరుస పొడిగింపులతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. నివేదిక (Report) ఎప్పుడో రెడీ అయిందని కొందరు.. ప్రభుత్వమే తీసుకోవట్లేదని ఇంకొందరు.. ఎప్పటికి సాకారమవుతుందోనని మరికొందరు.. ఇలా అనేక అనుమానాల్లో మునిగిపోయారు.

ఉద్యోగులను వెంటాడుతున్న సమస్యలు :

గత ప్రభుత్వంలో ప్రతి నెలా జీతం ఎప్పుడొస్తుందో తెలియని అయోమయం వారిని వెంటాడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బాధ తీరింది. కానీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు అందుతాయో తెలియని గందరగోళం నెలకొన్నది. ఇక డీఏల (DA) సంగతి సరేసరి. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో ఒకటి ఇవ్వగానే మరో కొత్త డీఏ తోడవుతున్నది. రూపాయి విలువ పడిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నెలవారీ ఖర్చులు ఊహకు అందని తీరులో పెరిగిపోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో వేతన సవరణ కోసం శివశంకర్ కమిషన్ సిఫారసులు వస్తే కనీసం ఫిట్‌మెంట్ అయినా దక్కుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ వారికి అది ఎండమావిగానే మిగిలిపోయింది.

ఉద్యోగ సంఘాలతో మీటింగ్‌లు కంప్లీట్ :

గత ప్రభుత్వంలో ఏర్పడిన తొలి పీఆర్సీ 7.5% ఫిట్‌మెంట్ సిఫారసు చేసినా ప్రభుత్వం మాత్రం 30% ఇచ్చింది. ఇప్పుడు 30%-51% ఉండాలని ఉద్యోగ సంఘాలు కమిషన్‌కు ప్రతిపాదనలు చేశాయి. ఎందుకు ఆ మేరకు పెరగాలో వారి సమస్యలను రాతపూర్వకంగా వివరించాయి. దాదాపు 80 సంఘాలతో కమిషన్ సమావేశాలను కంప్లీట్ చేసింది. ఈపాటికే రిపోర్టు ప్రభుత్వం చేతికి అందాల్సి ఉన్నా అది వాయిదా పడుతూనే ఉన్నది. ఇప్పటికే గడువు ముగిసిపోయింది. మరోసారి ఎక్స్ టెన్షన్ ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయనేది సచివాలయ వర్గాల సమాచారం. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ‘కమిషన్ గడువు మరోసారి పొడిగింపు’ అనే వార్త పిడుగులాగా తయారైంది. ఉద్యోగుల్లో మరింత అసహనం పెరగడానికి దారితీసింది.

ఇవ్వట్లేదా?.. తీసుకోవట్లేదా?.. :

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్, మరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామయ్యతో కూడిన పీఆర్సీ (Telangana PRC) ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిందని, ప్రభుత్వం ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు అఫీషియల్‌గా ఇవ్వడానికి రెడీగా ఉన్నదనేది ఒక సెక్షన్ ఉద్యోగుల అభిప్రాయం. రిపోర్టును తీసుకుంటే వెంటనే ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి వస్తుందని, అందువల్లనే సమయం ఇవ్వకుండా దాటవేస్తున్నదనేది మరో సెక్షన్ ఉద్యోగుల భావన. గత నెలలోనే నివేదిక ప్రభుత్వానికి అందుతుందని ఉద్యోగులు భావించారు. కానీ అదే జరిగితే ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుందని, ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో అది ఖజానాకు భారంగా మారుతుందని, అందువల్లనే తీసుకోకుండా వాయిదావేస్తూ ఉన్నదన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.

నెలకు ఐదారు వేల కోట్ల భారం ! :

రాష్ట్రంలో (Telangana) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు… ఇలా అంతా కలిసి దాదాపు 15 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. 1% ఫిట్‌మెంట్‌కు నెలకు కనీసంగా రూ. 250 కోట్ల మేర భారం పడుతుందన్నది ఫైనాన్స్ డిపార్టుమెంటు లెక్క. ఉదాహరణకు 20% ఫిట్‌మెంట్ ప్రకటిస్తే రూ. 5 వేల కోట్లు, 30 శాతానికి రూ. 7, 500 కోట్ల మేర భారం పడుతుంది. కొన్న ఉద్యోగ సంఘాలు 30% ఫిట్‌మెంట్ అడిగితే మరికొన్ని 51% అడిగాయి. కనీసంగా 20% ఇవ్వకపోతే ఒప్పుకునే ప్రసక్తే ఉండదని ప్రభుత్వానికి చేరేలా లీకులు పంపాయి. ఫిట్‌మెంట్ (Fitment) పైనల్ చేయాలంటే ముందుగా పీఆర్సీ (PRC) నివేదికను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం మధ్యంతర భృతి (Interim Relief) ప్రకటించి సరిపెట్టుకోవాలన్నా తొలుత ఆ రిపోర్టు ప్రభుత్వానికి చేరడం తప్పనిసరి. పీఆర్సీకి టైమ్ ఇస్తే ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వమే వెనకడుగు వేస్తున్నదనేది మరో అనుమానం.

Read Also: ట్యాపింగ్ అయిన ఫోన్‌లన్నింటికీ అప్రూవల్ ఉందా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>