జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ విజయం అద్దం పట్టిందన్నారు. ఉప పోరులో నవీన్ యాదవ్ విజయం సాధించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం క్రమంగా పెరుగుతోందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, నవీన్ యాదవ్(Naveen Yadav) విజయం కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నగర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోయినా, గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన పని, అమలు చేసిన పథకాలు చూసి ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇచ్చారని సీఎం అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి
“2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 39% ఓట్లు సాధించింది. ఆరునెలల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ శాతం 42కు పెరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మనకు 51% ఓట్లు రావడం ప్రజలు ప్రభుత్వం చేస్తున్న సేవలను అంగీకరించిన సంకేతం. గెలుపుతో ఉప్పొంగడం, ఓటమితో కుంగిపోవడం కాంగ్రెస్ స్వభావం కాదు. ప్రజల కోసం పనిచేయడం, వారి కోసం పోరాడడమే మా ధర్మం. రాష్ట్ర ఆదాయంలో సుమారుగా 65% భాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. అందుకే నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం,” అని సీఎం Revanth Reddy తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సహకరించకపోవడం అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించడానికి కారణమైందన్నారు. మెట్రో విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయడం ప్రజలకు నష్టమని ఆయన అన్నారు.
అదే సమయంలో కిషన్ రెడ్డి స్వయంగా పోటీ చేసిన ప్రాంతంలో భాజపా ఓట్ల తగ్గుదలపై కూడా సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. “65 వేలు ఓట్లు వచ్చిన చోట 17 వేలకే పడిపోయాయి. దీనిపై ఆయనే సమాధానం చెప్పాలి. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఫలితం భవిష్యత్తులో ఏమి జరగబోతోందో సూచించే సంకేతం. వైఖరి మార్చుకోకపోతే భాజపా పెద్ద దెబ్బలు తినాల్సి వస్తుంది,” అని వ్యాఖ్యానించారు.
ఓడినా KTR కు అహంకారం తగ్గలే
కేటీఆర్ ప్రవర్తనపై కూడా సీఎం స్పందించారు. “అధికారం కోల్పోయినా ఆయనలో అహంకారం, అసూయ తగ్గలేదు. పదవులు శాశ్వతం కావు. మనం ఇంకా ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉండాలి. అపోహలు సృష్టించే ఫేక్ సర్వేలు, తప్పుడు ప్రచారాలు ప్రజలకు నచ్చవు,” అని రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లో మద్దతు ఇచ్చినందుకు ఎంఐఎం నాయకులకు, ముఖ్యంగా అసదుద్దీన్ ఒవైసీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయాలు మారుతాయని అన్నారు. బిహార్ ఫలితాలను ఇంకా సమీక్షించలేదని, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో తీసుకుంటామని పేర్కొన్నారు.
కేసీఆర్(KCR) ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలంగా లేరని, ఆరోగ్య పరిస్థితులు కూడా పూర్తిగా అనుకూలంగా లేవని చెప్పారు. “వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. మార్పు ఎలా ఉండాలి అనేది ప్రజలకు చూపిస్తాం,” అని ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రకటించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
Read Also: బీజేపీ డిపాజిట్ గల్లంతు.. ఈ పతనానికి కారణం ఏంటి?
Follow Us on : Pinterest

