బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. బీహార్ లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 243. 122 స్థానాలు గెలుచుకున్న కూటమి అధికారంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్డీయే 192 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో ఆ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహాగఠ్‌బంధన్ కూటమి 46 స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది.
బీహార్(Bihar) లో ఎన్డీయే ఎందుకు బలపడింది?
ఎన్డీయేలో కీలక పార్టీలైన బీజేపీ(BJP), జేడీయూ(JDU) రెండు పార్టీలను ప్రజలు ఆదరించినట్టు కనిపించింది. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మడం, నితీశ్ కుమార్‌కు ఉన్న మచ్చలేని రాజకీయ వ్యక్తిత్వం ఈ ఎన్నికలో ప్రధాన పాత్ర పోషించినట్టు కనిపించింది. అయితే మహాఘట్ బంధన్ కూటమి ఎన్ని హామీలు గుమ్మరించినా ప్రజలు పెద్దగా నమ్మలేదు. మరోవైపు నితీశ్ కుమార్(Nitish Kumar) చివరినిమిషంలో మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది. ఆర్జేడీ మీద జంగల్ రాజ్ పాలన అంటూ పదే పదే విమర్శలు చేయడం కూడా మహాఘట్ బంధన్ కు ప్రతికూలంగా మారింది.
కూటమి సమన్వయం, గ్రామీణ ఓటు మద్దతు, అభివృద్ధి అంశాలు ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఉన్న మద్దతు, బీజేపీ పట్టణ ఓటు బేస్ కలిసి పనిచేసినట్లు స్పష్టమవుతోంది. మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసినా ప్రస్తుతం కేవలం 32 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. తేజస్వీ యాదవ్‌కు ప్రజల్లో మంచి పలుకుబడి ఉందన్న విశ్లేషణలు సాగాయి. అయితే ఆ పలుకుబడి ఏ మాత్రం పనిచేయలేదు. యాదవ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తమకు గుంపగుత్తగా పడతాయాని మహాఘట్ బంధన్ కూటమి సామాజిక సమీకరణలు లెక్కలు వేసుకుంది. కానీ ఆ లెక్కలు కూడా పనిచేయలేదు.
ఎన్డీయేలో లోక్‌జనశక్తి (రాంవిలాస్), ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం వంటి చిన్న పార్టీలతో ఉన్న కూటమి సమన్వయంతో పనిచేసింది. అయితే మహాగఠ్‌బంధన్‌లో సీపీఐ, సీపీఎం, విప్ వంటి పార్టీలతో కూటమి ఉన్నా అంతర్గత కుమ్ములాటలు నష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67.13% ఓటింగ్ నమోదైంది. మహిళల ఓటింగ్ శాతం 71.78% ఉండటం ప్రత్యేకంగా గమనార్హం. అయితే అధిక ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందని చెబుతుంటారు. కానీ బీహార్ లో ఈ సారి పోలింగ్ పెరిగినా అది ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేసింది. రాహల్ గాంధీ ఓట్ చోరీ అంటూ రాష్ట్రం మొత్తం తిరిగినా, బీజేపీ మీద ఎన్నో విమర్శలు చేసినా అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తేజస్వీ యాదవ్ నాయకత్వాన్ని వారు ఒప్పుకోలేదు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారిపోయింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీన పడుతోంది. తాజాగా ఆ ఖాతాలో బీహార్ కూడా చేరింది.
Read Also: నెక్స్ట్ టార్గెట్.. లోకల్ ఫైట్
Follow Us on: Youtube

