కలం, నిజామాబాద్ బ్యూరో : ఆ దంపతులు నిజామాబాద్ (Nizamabad) మేయర్ సీటు టార్గెట్‌గా పెట్టుకున్నారు. రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీకి సై అంటూ నామినేషన్‌కు రెడీ అయిపోయారు. కానీ నిబంధనల ముందు మాత్రం ఎంతటి వారైనా తలవంచాల్సిందేనని నిజామాబాద్ ఘటన నిరూపించింది. ఎన్నికలు వారితో ప్రచారం ప్రారంభం కాకముందే ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టించాయి. కాంగ్రెస్ (CONGRESS) పార్టీ నుంచి మేయర్ రేసులో ఉన్న శమంత నరేందర్ రెడ్డి దంపతులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏకంగా రూ. 8,16,65,000 ఆస్తి పన్నును ఏకకాలంలో చెల్లించి అందరినీ విస్మయానికి గురిచేశారు.
2009 నుంచి అంటే దాదాపు 17 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను, ఎన్నికల నోటిఫికేషన్ పుణ్యమా అని మున్సిపల్ ఖజానాకు చేర్చారు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్‌లో డైరెక్టర్‌గా ఉన్న నరేందర్ రెడ్డి భార్యకు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు నో డ్యూ సర్టిఫికేట్ అనివార్యమైంది. బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని అధికారులు తెగేసి చెప్పడంతో చేసేదేం లేక రాజకీయ లక్ష్యం కోసం ఆరు భారీ డీడీల రూపంలో ఆ మొత్తాన్ని మున్సిపల్ అధికారులకు సమర్పించారు..
ఎన్నికల ఫండ్ జిగేల్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) చరిత్రలో ఒక వ్యక్తి నుంచి ఇంత భారీ మొత్తం పన్ను రూపంలో రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా సామాన్యుల దగ్గర వందల రూపాయల పన్ను కోసం కఠినంగా వ్యవహరించే యంత్రాంగం ఇన్నాళ్లుగా కోట్ల రూపాయల బకాయిని వసూలు చేయలేకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు వస్తేనే బకాయిలు వసూలవుతాయి అనే కొత్త సూత్రాన్ని ఈ ఘటన నిజం చేసింది. మరోవైపు ఎన్నికల పుణ్యమా అని పన్ను రూపంలో వచ్చిన డబ్బులతో కార్పొరేషన్ ఖజానా కళకళలాడింది.
Read Also: ‘బడ్జెట్‌ను జనంలోకి తీసుకెళ్ళండి‘.. రేపు బీజేపీ పార్లమెంటరీ మీటింగ్
Follow Us On: Youtube


