‘భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ మా నిర్ణయం కాదు’

కలం, స్పోర్ట్స్​ : టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) లో భారత్‌తో జరిగే మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ తాజా పరిణామంపై పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందించారు. ఫిబ్రవరి 1న ప్రభుత్వం 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ లో జట్టు పాల్గొంటుందని ప్రకటించింది. అదే సమయంలో గ్రూప్ దశలో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని జట్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఈ నిర్ణయానికి ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నమెంట్ నుంచి తొలగించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చినట్టు ప్రకటించింది. ఈ ఘటనల తరువాతే పాకిస్థాన్ విషయంలోనూ కఠిన వైఖరి కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై సల్మాన్ అలీ ఆఘా స్పందిస్తూ, ఈ విషయం ఆటగాళ్ల పరిధిలోకి రాదని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సూచనలను జట్టు తప్పనిసరిగా పాటిస్తుందని చెప్పారు. ఈ అంశంలో వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ పోటీపడుతుందని ఆఘా తెలిపారు. అధికారికంగా వచ్చే సూచనల ప్రకారమే జట్టు ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సి ఉంది. గ్రూప్ ఏలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో పాటు పాకిస్థాన్ ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌కు ముందు పాకిస్థాన్ జట్టు మంచి ఊపులో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 3–0తో ఘన విజయం సాధించింది.

అయితే భారత్‌తో మ్యాచ్‌కు హాజరు కాకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ మ్యాచ్ ఫోర్ఫిట్‌గా పరిగణిస్తారు. దీంతో పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు నష్టం కలగడంతో పాటు నెట్ రన్‌రేట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై ఐసీసీ దృష్టి సారించింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి.

Read Also: కోహ్లీని దాటేసిన బాబర్ అజామ్.. ఎందులో అంటే..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>