కలం డెస్క్ : జూబ్లీ హిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు పార్టీలపై ప్రభావం చూపింది. అధికార కాంగ్రెస్ తన సత్తా చాటుకోవడంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. మరోవైపు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో మూడవ స్థానానికే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజలు మద్దతు పలికినట్లు ఈ ఉప ఎన్నిక ఫలితం ద్వారా స్పష్టమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన ఈ ఉప ఎన్నికకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితం రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడనున్నది.
దూకుడులో అధికార కాంగ్రెస్ :
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) విఫలమయ్యారని, మంత్రులను సైతం కట్టడి చేయలేకపోతున్నారని, అధికారులు ఆయన మాట వినడంలేదని, కాంగ్రెస్ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందని.. ఇలా విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు జూబ్లీ హిల్స్(Jubilee Hills) ఓటర్లు మాత్రం ఆ పార్టీకే పట్టం కట్టారు. పురపాలక శాఖ మంత్రి బాధ్యతలను కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటుండడం ఈ ఉప ఎన్నికలో ప్రత్యేక అంశం. స్వయంగా ఆయనే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అభ్యర్థి గెలుపు కోసం చొరవ తీసుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఏ స్థాయిలో అభివృద్ధి చేయనున్నదీ ఓటర్లకు వివరించారు. రేవంత్ రెడ్డి పని అయిపోయిందని విపక్షాల విమర్శలకు జూబ్లీ హిల్స్ ఫలితం స్పష్టతను ఇచ్చింది. రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ తర్వాత జరే జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం తథ్యమనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన అభివృద్ధి ఫలాలు తమ పార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్(BRS) గంపెడాశలు పెట్టుకున్నా చివరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తారుమారు కావడంతో భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికి మరింత పడిపోతుందనే అనుమానాలు, ఆందోళనలు ఆ పార్టీ నేతల్లోనే నెలకొన్నాయి. అన్నీ తానై కేటీఆర్(KTR) చక్రం తిప్పినా జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కైవశం చేసుకోలేకపోయింది. మాగంటి గోపీనాధ్ మృతితో ఆయన భార్యకే టికెట్ ఇచ్చామని గొప్పగా చెప్పకున్నా సెంటిమెంట్ (సానుభూతి) అస్త్రం పనిచేయలేదు. కేటీఆర్ నాయకత్వాన్ని ఈ ఫలితం పరీక్షగా మార్చింది.
బీజేపీ పట్ల అర్బన్ ఓటర్ల విముఖత :
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అని బీజేపీ(BJP) గొప్పగా చెప్పుకున్నా, మోడీ పాలనా తీరు పట్ల అర్బన్ ఓటర్లు సంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం చేసుకున్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం మూడవ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగి మోడీ పాలనను ప్రచారం చేసినా, తెలంగాణకు నిధులు ఇచ్చామని వివరించినా ఓటర్లు మాత్రం ఆ పార్టీని ఆదరించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికలో ప్రతికూల ఫలితమే వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరొకరికి బాధ్యతలు అప్పజెప్పడంపై ఆ పార్టీ నిర్ణయం తీసుకోనున్నది.
Read Also: విశాఖలో సీఐఐ సదస్సు ప్రారంభం
Follow Us on: Instagram

