కలం, వెబ్ డెస్క్ : మేడారం (Medaram Jatara) సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో ఒక భక్తుడు తన పెంపుడు కుక్కపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ మొక్కు తీర్చుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం బోగంపాడు గ్రామానికి చెందిన జిల్లెల సందీప్ రెడ్డి శనివారం మొక్కును తీర్చాడు. సుమారు రెండేళ్ల క్రితం ఆయన పెంపుడు శునకం జున్ను తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో తన కుక్క త్వరగా కోలుకోవాలని, అలా జరిగితే గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పిస్తానని ఆయన వన దేవతలను వేడుకున్నారు.
సందీప్ రెడ్డి మొక్కుకున్న విధంగానే జున్ను ఆరోగ్యం కుదుటపడటంతో, ఆయన తన పెంపుడు కుక్కను మేడారానికి తీసుకువచ్చారు. అక్కడ కుక్క బరువుకు సమానంగా ఆరు కిలోల బెల్లాన్ని (బంగారం) అమ్మవార్లకు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అయితే ఇలా పెంపుడు జంతువులకు మొక్కులు తీర్చడం మేడారం (Medaram Jatara)లో ఇదే మొదటిసారి కాదు. గతంలో సినీ నటి టీనా శ్రావ్య కూడా తన పెంపుడు కుక్కకు ఇదే విధంగా నిలువెత్తు బంగారం సమర్పించి వార్తల్లో నిలిచారు.
నటి టీనా శ్రావ్య ఉదంతం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. పెంపుడు జంతువులను గద్దెల వరకు తీసుకురావడంపై ఇతర భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆమె సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. తన కుక్క ఆరోగ్యం కోసం మాత్రమే అలా చేశానని ఆమె వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సందీప్ రెడ్డి కూడా తన పెంపుడు శునకానికి మొక్కు చెల్లించడంతో, దీనిపై భక్తులు, ఆలయ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: ఆపరేషన్ స్మైల్.. 5వేల మంది చిన్నారులకు విముక్తి
Follow Us On: Instagram


