కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ (SIT) పోలీసుల ముందు కేసీఆర్ (KCR) హాజరవుతారా?.. సీఆర్పీసీ (CrPC)లోని సెక్షన్ 160 నిబంధన ప్రకారం ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లోనే ఉండిపోతారా?.. పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చినట్లుగా హైదరాబాద్‌లోని నందినగర్‌కు వచ్చే అవకాశం లేదా?.. ఇలాంటి సందేహాలు నెలకొన్నాయి. సిట్ పోలీసులు ఇచ్చిన గడువు ప్రకారం మరో రెండు గంటల్లో కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకోవాల్సి ఉన్నది. ఒకవేళ హాజరు కాకపోతే పోలీసుల తదుపరి చర్యలేంటి?.. లీగల్‌గా ప్రొసీడ్ అవుతారా?.. జడ్జి నుంచి వారెంట్ ఉత్తర్వులు తీసుకుంటారా?.. ఐపీసీలోని సెక్షన్ 174 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?.. లేక మరోసారి నోటీసు ఇస్తారా?.. ఇలాంటి ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. కేసీఆర్ లీగల్ మార్గాలపై అన్వేషిస్తున్నారు. నిపుణులతో చర్చిస్తున్నారు. అదే సమయంలో పోలీసు అధికారులూ తదుపరి కార్యాచరణపై డిస్కస్ చేస్తున్నారు.
చర్చంతా అధికారిక నివాసంపైనే.. :
కేసీఆర్ (KCR) అధికారిక నివాసమేది? ఎలక్షన్ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా హైదరాబాద్‌లోని నందినగర్ ఇల్లే ఆయన నివాసమా?.. లేక ప్రస్తుతం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్‌హౌజా?.. పోలీసుల వాదన ప్రకారం అటు ఎలక్షన్ అఫిడవిట్‌లోనూ, ఇటు అసెంబ్లీ రికార్డుల్లోనూ పేర్కొన్నట్లుగా నందినగర్‌లోని ఇల్లే ఆయన నివాసం. కానీ ఇప్పుడు ఉంటున్నది ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కాబట్టి ఇదే తన నివాసమన్నది కేసీఆర్ వాదన. రాతపూర్వకంగా తన నివాసం, చిరునామా గురించి కేసీఆర్ ఆ లేఖలో స్పష్టత ఇచ్చారు. ఇకపైన ఎలాంటి కమ్యూనికేషన్/నోటీసులు ఇవ్వాలనుకున్నా ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ అడ్రస్‌నే పరిగణనలోకి తీసుకోవాలని నొక్కిచెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఫామ్‌హౌజ్‌ను అధికారిక నివాసంగా పరిగణించలేమని, నందినగర్ నివాసంలో తొలుత ఇచ్చిన నోటీసుకు కేసీఆర్ స్పందించినందున అదే ఆయన అఫీషియల్ రెసిడెన్స్ అవుతుందన్నది పోలీసుల వాదన.
ఇద్దరి వాదనలూ సెక్షన్ 160 చుట్టే.. :
ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీకి కేసీఆర్ హాజరు కావాలంటూ సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చింది సీఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారమే. ఇందులోని నిబంధన ప్రకారం 65 ఏండ్లు దాటిన వ్యక్తి తప్పనిసరిగా పోలీసు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు. వారు నివాసం ఉంటున్న ప్రాంతానికే పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వాడుకునే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు రావాలని సూచించారు. ఇటు పోలీసులు సైతం అదే నిబంధనను ప్రస్తావిస్తూ నందినగర్ అఫీషియల్ రెసిడెన్స్ అయినందున అక్కడే విచారిస్తామని తేల్చి చెప్పారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను అధికారిక నివాసంగా పరిగణించలేమని పేర్కొని కేసీఆర్ రిక్వెస్టును, ప్రతిపాదనను తిరస్కరించారు. రెండు పక్షాలూ సెక్షన్ 160 నిబంధననే ప్రామాణికంగా తీసుకున్నాయి. దీంతో కేసీఆర్ హాజరవుతారా?.. లేదా?.. హాజరు కాకుంటే ఏం జరుగుతుంది?.. పోలీసులు తదుపరి ఏ చర్యలు తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
హాజరు కాకుంటే ఏం జరుగుతుంది? :
సీఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం పోలీసులు నోటీసు జారీ చేసిన తర్వాత సాక్షి (Witness) హాజరు కావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఐపీసీలోని సెక్షన్ 174 ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు ఉంటుందన్నది లాయర్ల వాదన. పబ్లిక్ సర్వెంట్ జారీచేసిన నోటీసును నిర్లక్ష్యం చేశారనే కారణాన్ని చూపించొచ్చు. ఈ సెక్షన్ ప్రకారం నెల రోజుల జైలు శిక్ష, రూ. 500 వరకు జరిమానా విధించే అధికారం పోలీసులకు ఉంటుంది. అరెస్టు వారెంట్ జారీచేసేలా మేజిస్ట్రేట్‌ను పోలీసులు కోరే అవకాశం ఉంటుంది. సాక్షి వాంగ్మూలం, వివరణ నిర్దిష్ట కేసు దర్యాప్తులో కీలకం అని భావించినప్పుడు పోలీసులు పై రూపాల్లో చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందన్నది న్యాయవాదుల వాదన. అటు కేసీఆర్, ఇటు పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాతనే తదుపరి నిర్ణయాన్ని తీసుకునేలా ఆలోచిస్తున్నారు.


