కలం, వరంగల్ బ్యూరో : మేడారం మహా జాతర (Medaram Maha Jathara) శివమూగుతోంది.. గద్దెపై తల్లులు కొలువు తీరడంతో సమ్మక్క, సారలమ్మ నామ స్మరణ తో మేడారం మార్మోగుతోంది మేడారంలో ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. భక్తులు జంపన్న వాగు లో పుణ్య స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దీంతో జంపన్న వాగు పరిసరాలు, గద్దెల ప్రాంతంలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. వన దేవతల నామస్మరణలు.. మరోవైపు శివసత్తుల పూనకాలతో హోరెత్తుతోంది. తెలంగాణలోని అరణ్య ప్రాంతంలో జరుగుతున్న మహాజాతర మూడో రోజూ భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
అమ్మవార్ల జాతరతో మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి వైపు భక్తుల నినాదాలు, భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. భక్తులు తెల్లవారుజామునే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ, వనదేవతల గద్దెల వద్ద అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. దర్శన సమయంలో భక్తుల భద్రతకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గద్దెల వద్ద క్యూలు క్రమబద్ధంగా సాగేందుకు వలంటీర్లు సహకరిస్తున్నారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు.
ట్రాపిక్ జామ్….
మేడారంకి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. తాడ్వాయి నుంచి మేడారం మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వీఐపీల తాకిడి…
మేడారం జాతరకు వీఐపీల తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించడంతో భారీగా వీఐపీలు హాజరు అవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ శుక్రవారం అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్త బంగారం సమర్పించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క మేడారం మహా జాతర ప్రాముఖ్యత, కొత్తగా నిర్మించిన గద్దెలు, గిరిజన చరిత్ర భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఆయనకు వివరించారు. అలాగే రాష్ట్ర డీజిపి శివధర్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాధ్, మాజీ మంత్రి మల్లారెడ్డి అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు.

Read Also: ఈ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. వాళ్లకు నిరాశే..
Follow Us On: Youtube



