కలం, వెబ్ డెస్క్ : ఒలింపిక్ పతక విజేత క్రీడాకారుడు సురాజ్ పన్వర్ తల్లిని హిప్నటైజ్ చేసి దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్న ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. డెహ్రడూన్ లోని పటేల్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫారెస్ట్ శాఖ ఉద్యోగిని పూనమ్ పన్వర్ బుధవారం ఉదయం బైపాస్‌లోని తన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుండగా.. చంద్రబానీ చౌక్ సమీపంలో ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. కొంతదూరం నడిచిన తర్వాత మరో వ్యక్తి కూడా వారికి తోడయ్యాడు. తమకు క్షుద్ర శక్తులపై పట్టు ఉందని, మంత్రాలతో ఆమెను ఆకర్షించి హిప్నటైజ్ చేశారు.
ఆ తర్వాత చెట్టు కిందకు తీసుకెళ్లి.. ఆమె పర్సులోని డబ్బులను, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అయితే, తమ మాటలు వినకపోతే ఇంటికి నిప్పంటిస్తామని నిందితులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. వీటి ఆధారంగా పటేల్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడుగురు దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన సురాజ్ 2018 సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో పురుషుల 20 కి.మీ రేస్ వాక్‌లో రజత పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడు ఆయన తల్లిపై జరిగిన దోపిడీ ఘటన Uttarakhand లో కలకలం రేపుతోంది.


