కలం, వెబ్‌డెస్క్: సైబర్ నేరాల నియంత్రణలో ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) యాప్ అద్భుతంగా పనిచేస్తోందని కేంద్రం వెల్లడించింది. ఈ యాప్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కోటిన్నర అనుమానిత మొబైల్ నెంబర్ల ఆటకట్టించినట్లు వివరించింది. ఈ నెంబర్లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ పాంచజన్య పత్రిక శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఈ విషయాలు వెల్లడించారు.
27 లక్షల వాట్సాప్ ఖాతాలు నిలిపివేత..
దేశంలో డిజిటల్ వాడకం వేగంగా పెరుగుతుండడంతో సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ (Sanchar Saathi) ను తెచ్చిందని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ యాప్‌పై విమర్శలు వచ్చినా.. ప్రజల్లో మాత్రం ఆదరణ ఉందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సంచార్ సాథీ పోర్టల్‌కు 20కోట్లకు పైగా హిట్స్ వచ్చాయని, 2కోట్లకు పైగా డౌన్లోడ్స్ జరిగాయని చెప్పారు.
‘అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 1.52కోట్ల మొబైల్ నెంబర్లను సంచార్ సాథీ యాప్ బ్లాక్ చేసింది. వెరిఫికేషన్ ద్వారా మరో 2 కోట్ల నెంబర్లను డిస్కనెక్ట్ చేశాం. ఈ నెంబర్లకు అనుంసంధానమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫాలంలపైనా చర్యలు తీసుకున్నాం. అంతేకాదు, 27లక్షల వాట్సాప్ అకౌంట్స్నూ నిలిపివేశాం’ అని కేంద్ర మంత్రి అన్నారు. సైబర్ మోసాల నుంచి రక్షించే బలమైన ఫైర్వాల్లాగా సంచార్ సాథీ పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు.
రోజుకు 1.35 కోట్ల మోసపూరిత కాల్స్..
సైబర్ మోసాల గుర్తింపులో బ్యాక్ ఎండ్‌లో ఇంటిలెజెన్స్ వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇందులో ఐకోర్ (ICORE) ముఖ్యమైనదని చెప్పారు. ఇది వివిధ ప్రభుత్వ ఏజెన్సీల డేటాను సమన్వయం చేస్తోందని తెలిపారు. ‘గతంలో విదేశాల నుంచి రోజుకు సుమారు 1.35 కోట్ల మోసపూరిత కాల్స్ వచ్చేవి. వీటిని గుర్తించి రాకుండా చేశాం. సంచార్ సాథీ యాప్, డిజిటల్ ఫోరెన్సిక్, ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంల సహకారంతో రాష్ట్రాలు, దేశాల మధ్య పనిచేస్తున్న మోసాల నెట్‌వర్క్‌లు గుర్తించాం. ఫలితంగా నకిలీ కాల్స్ సంఖ్య దాదాపు 95 శాతం తగ్గింది’ అని జ్యోతిరాదిత్య వెల్లడించారు.
Read Also: జాతరకు వెళ్లేదెలా.. మేడారంకి ఫిట్నెస్ లేని బస్సులు
Follow Us On: Sharechat


