కలం, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర (Medaram Jatara)లో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తుల రద్దీ పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క తో కలిసి ఆయన మాట్లాడారు.
వనదేవతల దర్శనానికి ఈరోజు ఒక్కరోజే సుమారు 80 లక్షల మంది భక్తులు తరలివచ్చారని, సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకునే సమయానికి ఈ సంఖ్య కోటి దాటే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారని, వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.
మేడారం జాతర (Medaram Jatara) శాశ్వత అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందన్న ఆయన, ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల సేకరణ ప్రక్రియ సాగుతోందని వివరించారు. ఈ 70 ఎకరాల్లో భక్తుల కోసం కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ నిర్మిస్తున్నామని, జంపన్న వాగులో (Jampanna Vagu) ఏడాది పొడవునా నీరు ఉండేలా పైప్లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
మేడారానికి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించామని, దీని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు జరుగుతుందని మంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు. చివరగా, గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం సాయంత్రం 4 గంటలకు తిరిగి వనప్రవేశం చేస్తారని మంత్రి పొంగులేటి వివరించారు.
Read Also: రజినీ బయోపిక్ అదిరిపోతుందట
Follow Us On: Pinterest


