కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో సిట్(SIT) అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు కూడా నోటీసులు అందజేశారు. గురువారం మధ్యాహ్నం నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో కేసీఆర్‌కు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కేసీఆర్ వయసు 65 ఏండ్ల పైబడి వయసు ఉండటంతో స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘ఎక్కడ విచారించాలో మీకు అనుకూలమైన స్థలాన్ని హైదరాబాద్ పరిధిలో ఎంపిక చేసుకోండి’ అంటూ కేసీఆర్‌కు సిట్ అధికారులు సూచించారు. అయితే కేటీఆర్, హరీశ్ రావును సిట్ అధికారులు విచారించిన సమయంలో భారీగా జనసమీకరణ చేశారు. మరి కేసీఆర్‌ను విచారించే సమయంలోనూ జన సమీకరణ చేస్తారా? కార్యకర్తలను భారీగా తరలిస్తారా? అన్నది వేచి చూడాలి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌కు సిట్ అధికారులు ప్రశ్నలు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


