కలం, స్పోర్ట్స్: భారత్, శ్రీలంక వేదికగా జరిగే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) 2026లో పాకిస్థాన్ (Pakistan) పాల్గొంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ అంశంపై తుది నిర్ణయం మరికొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశముందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తాజా అప్‌డేట్ ఇచ్చారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో జరిగిన సమావేశంలో ఐసీసీ వ్యవహారంపై విస్తృత చర్చ జరిగిందని నఖ్వీ వెల్లడించారు. అన్ని మార్గాలను పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలని ప్రధాని సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లేదా వచ్చే సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు, భద్రతా కారణాలతో భారత్ (India)కు వెళ్లేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ ఆ జట్టును తప్పించి స్కాట్లాండ్‌ను ఎంపిక చేసిన తర్వాత చోటుచేసుకున్నాయి. ఆ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అసంతృప్తిని రేకెత్తించింది. వివాదంలో బంగ్లాదేశ్‌కు పీసీబీ మద్దతుగా నిలిచింది. ఇదివరకే ఈ అంశంపై తుది మాట కేంద్ర ప్రభుత్వానిదేనని నఖ్వీ స్పష్టం చేయడంతో పాకిస్థాన్ పాల్గొనడంపై చర్చలు మరింత వేడెక్కాయి.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) పాకిస్థాన్ గ్రూప్-ఏలో భారత్, నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియాతో ఉంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం పాక్ గ్రూప్ మ్యాచ్‌లు అన్నీ శ్రీలంకలో జరగనున్నాయి. భారత్‌తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సెమీఫైనల్, ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి. లేనిపక్షంలో నాకౌట్ పోరులు భారత్‌లోని వేదికల్లో నిర్వహించనున్నారు.
Read Also: హ్యారీ కేన్ కాంట్రాక్ట్‌పై బయర్న్ క్లారిటీ
Follow Us On : WhatsApp


