epaper
Tuesday, November 18, 2025
epaper

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వారికి గుడ్ న్యూస్

ఏపీ క్యాబినెట్(AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సీఎం చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలో సమావేశమైంది. సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో 70కుపైగా అజెండా అంశాలపై చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్(Quantum Computing Centre)’ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రపంచ ఐటీ దిగ్గజాలతో భాగస్వామ్యంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయంతో అమరావతిని అత్యాధునిక టెక్నాలజీ నగరంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వం సంకల్పాన్ని మరోసారి స్పష్టంచేసింది.

భూముల కేటాయింపుపై కీలక నిర్ణయాలు

సీఆర్డీఏ పరిధిలోని భూముల కేటాయింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీ, తయారీ, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్‌ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టదలచిన సంస్థలకు భూముల కేటాయింపులో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేసే దిశగా కొన్ని ప్రతిపాదనలకు క్యాబినెట్(AP Cabinet) ఆమోదం తెలిపింది.

రెవెన్యూశాఖలో ఖాళీల భర్తీ

రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ చేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నది. ఖాళీలను తక్షణం నింపేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ప్రజా సేవల్లో ఆలస్యం జరుగుతోందని గుర్తించిన ప్రభుత్వం, దీనికి శాశ్వత పరిష్కారం కోసం కొత్త నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది.

తుపాను సమయంలో చేసిన సేవలపై కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రులను, అధికారులను అభినందించారు. ఇటీవల రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన ‘మొంథా తుపాను’ సమయంలో ప్రతి మంత్రి, జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందని అన్నారు. “ఆర్టీజీఎస్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయడం, అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే సమర్థవంతంగా పరిస్థితిని ఎదుర్కొన్నాం” అని సీఎం ప్రశంసించారు.

ఇండ్ల పంపిణీ వేగవంతం

పేదల సంక్షేమంపై మాట్లాడుతూ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నివాస స్థలం లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల జాబితాను పర్యవేక్షించి, అర్హులందరికీ ఇల్లు అందేలా చూడాలని సూచించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యత కూడా మంత్రులు తీసుకోవాలని సీఎం అన్నారు. “ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజల దృష్టికి రాకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ సంకల్పం తెలియజేయాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని ప్రస్తావిస్తూ, “జాప్యం తగదు. త్వరితగతిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కొత్త విధానం రూపొందించాలి. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి” అని సీఎం ఆదేశించారు.

Read Also: దగ్గు మందు కంపెనీలకు కేంద్రం అల్టిమేటం..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>