భారత్‌ను చుట్టుముట్టేలా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు(Indian intelligence) హెచ్చరించాయి. ఇందుకోసం పాక్ అనుబంధ ఉగ్ర సంస్థలు సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లలో కొత్త ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్ – నేపాల్, భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దులకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఈ కుట్రలు వేగవంతమైనట్టు తెలుస్తోంది.
ఉగ్రవాదులకు నివాసాలుగా, శిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకునే ప్రదేశాలను బంగ్లాదేశ్, నేపాల్ ప్రాంతాల్లో సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఈ రెండు దేశాల సరిహద్దులకు ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాల్లో పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న పలువురు ఉగ్ర కార్యకర్తలను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తులో ఈ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలపరిచినట్లు అధికారులు తెలిపారు. అలాగే పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో సాగుతున్న ప్రాజెక్టులపై కూడా నిఘా ఉంచినట్లు సమాచారం.
పాక్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ నేపాల్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని, అల్‌ఖైదా, ఐసిస్ గుంపులు గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్‌లో తమ ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్(Indian intelligence) నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బంగ్లా, నేపాల్‌లకు నిరంతర వలసలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ శిబిరాల నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నిధులను తుర్కియే అందిస్తున్నట్లు సమాచారం. ఢాకాలోని జమాత్-ఇ-ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు కూడా తుర్కియే నిఘా సంస్థలే నిధులు సమకూర్చినట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తూ, పక్క దేశాల్లో జరుగుతున్న ఉగ్ర కదలికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ ఉగ్రకార్యకలాపాలకు భారత నిఘావర్గాలు, సైన్యం ఎలా చెక్ పెడతాయో వేచి చూడాలి.
Read Also: అందెశ్రీ మరణంపై ప్రధాని సంతాపం..
Follow Us on: Instagram

