కలం, వెబ్ డెస్క్: ‘సార్ .. నాకు ఓ మీడియా చానల్‌లో అవమానం జరిగింది. వెంటనే సదరు మీడియా సంస్థపై చర్యలు తీసుకోండి’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఆ పార్టీ ఎమ్మెల్సీల (BRS MLCs) బృందం మండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇటీవల తక్కళ్లపల్లి రవీందర్ రావు ఏబీఎన్ చానల్‌లో డిబేట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో మోడరేటర్‌కు, తక్కెళ్ళపల్లి రవీందర్‌రావుకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. చివరకు మోడరేటర్ సహనం కోల్పోయి తక్కళ్లపల్లి రవీందర్ రావును ‘గెట్ అవుట్’ అన్నారు.
ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకున్నది. సదరు మీడియా చానల్‌ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ప్రతినిధులు ఎవరూ ఓ మీడియా చానల్ కు వెళ్లొద్దని ఆదేశించింది. ఇదెలా ఉండగా మంగళవారం శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి నేతృత్వంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలు (BRS MLCs) తక్కళ్లపల్లి రవీందర్ రావు వెంట, విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.


