కర్ణాటక రాష్ట్రంలో సీఎం మార్పు అంశం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సీఎం సిద్దరామయ్య(Siddaramaiah)కు అధిష్ఠానం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఈ ప్రచారం మరోసారి జోరందుకున్నది. తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నర సంవత్సరాలు సిద్దరామయ్య, తర్వాత రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మౌఖికంగా జరిగిన ఒప్పందం అని సమాచారం. అయితే రెండున్నర ఏండ్లు గడిచినా సిద్దరామయ్య తన సీటును వదులుకొనేందుకు ఇష్టపడటం లేదు. డీకే శివకుమార్ మాత్రం పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ పంచాయితీ ఎటూ తెగడం లేదు. తాజాగా సిద్దరామయ్యకు అధిష్ఠానం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
నవంబర్ చివర్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)లు బెంగళూరు, ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతుండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆయన కాంగ్రెస్ పెద్దలను కలవాలని భావించి వారికి సమాచారం పంపించారు. అయితే అందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదని సమాచారం.
దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం సిద్ధరామయ్య(Siddaramaiah)పై కొంత అసంతృప్తిగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సిద్ధరామయ్య మాత్రం తాను, తమ ప్రభుత్వం బలంగా ఉన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండున్నరేళ్లు సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మనకే ఓటేస్తారు’’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇక డీకే శివకుమార్ మెల్లగా పావులు కదుపుతున్నారు. హామీ ప్రకారం ముఖ్యమంత్రి పదవి తనదేనన్న నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఆయనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో సన్నిహితంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల రాఘవేంద్ర హిట్నాల్ నిర్వహించిన విందు కూడా ఇదే క్రమంలో భాగమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
డీకే శివకుమార్‌కు అనుకూలంగా ఎమ్మెల్యేలను ఒకే దగ్గరకు చేర్చేందుకే ఈ విందును వినియోగించుకున్నారని తెలుస్తోంది. ఇక బిహార్ ఫలితాల తరువాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు ముందుగానే తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్‌లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. తెరవెనుక మాత్రం ఎదో జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
Read Also: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రం భగ్నం
Follow Us on: Instagram

