కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా కోదాడలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ (Kodad Labour Office) లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కార్యాలయ పనితీరులో అక్రమాలతో పాటు అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తేలింది. ప్రధానంగా రికార్డు స్థాయిలో 1,593 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో పెళ్లి కానుకలు, ప్రసూతి ప్రయోజనాలు, కార్మికుల నేచురల్ డెత్ తో పాటు ప్రమాద మరణ క్లెయిమ్‌లకు సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు తేలింది.
దీనికి తోడు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కె. తులసీరాం ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైనట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దాదాపు 430 దరఖాస్తులను అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో కనీసం లబ్ధిదారులకు కనీస సమాచారం ఇవ్వకుండా పక్కన పడేశారు. కార్యాలయంలో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, పనుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


