epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యం: గవర్నర్

కలం, వెబ్ డెస్క్: మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma)  పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌తో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మనదేశం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ గవర్నర్ సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం తనదైన అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నదని చెప్పారు. 1950 జనవరి 26న డాక్టర్ రాజేంద్ర‌ప్రసాద్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, మన దేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించారన్నారు. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని సమతూకం చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు.

తెలంగాణ విముక్తి పోరాటం

‘భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలోనే కొనసాగింది. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం ఫలితంగా సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై, రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. ఈ చారిత్రక విజయాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎంతో గౌరవప్రదంగా నిర్వహిస్తోంది.’ అని గవర్నర్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం రెండేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్నేహపూర్వక పాలనను అందించడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం “తెలంగాణ రైజింగ్-2047 విజన్ పాలసీ”ని రూపొందించింది. ఇది గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’ ఆశయాలకు అనుగుణంగా రూపొందించబడింది.’  అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) పేర్కొన్నారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం

‘గత నెలలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025” వేదికగా ప్రభుత్వం తన విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించింది. ఆర్థిక లక్ష్యం 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. తద్వారా భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో తెలంగాణను కీలక భాగస్వామిని చేయడం. ఈ సమ్మిట్ ద్వారా సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇవి లక్షలమంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.‘ అని గవర్నర్ పేర్కొన్నారు.

తెలంగాణ దేశానికే ఆదర్శం

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ, సామాజిక న్యాయం అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందులో భాగంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య మరియు ఉపాధి స్థితిగతులపై సర్వే చేపట్టి, బీసీ కుల గణన ద్వారా బలహీన వర్గాల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. చివరిగా, రాజ్యాంగ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుంటూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలపడమే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.

 Read Also: మేడారంలో ఇప్పపువ్వు లడ్డూకు ఫుల్ డిమాండ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>