కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో (Padma Awards) తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ కు మంచి ప్రాధాన్యం దక్కింది. తమిళనాడు కోటా కింద 13, కేరళ కోటా కింద 8, పశ్చిమ బెంగాల్ కోటా కింద 11 పురస్కారాలు లభించాయి. త్వరలో ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతోనే వాటికి టాప్ ప్రయారిటీ దక్కినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంకు కూడా ఈ రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరగనుండగా.. అక్కడ బీజేపీ అధికారంలో ఉండటంతో ఎప్పటిలానే ఆ రాష్ట్రానికి కోటా వచ్చిందన్న టాక్ వినిపిస్తున్నది.
ఏ రాష్ట్రానికి ఎన్ని?
మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించగా.. ఇందులో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ కింద 5, పద్మభూషణ్ కింద 13, పద్మశ్రీ కింద 113 అవార్డులు ఉన్నాయి. ఎప్పటిలాగానే మహారాష్ట్రకు ఈసారి టాప్ ప్రయారిటీ దక్కింది. ఈ రాష్ట్రం కోటాలో 16 మందికి పద్మ అవార్డులు వరించాయి. 2025లో మహారాష్ట్రకు 20 పురస్కారాలు లభించాయి.
– తమిళనాడుకు ఈసారి 13 పద్మ అవార్డులు దక్కగా.. ఇందులో పద్మభూషణ్ 2, పద్మశ్రీ 11 ఉన్నాయి. 2025లో ఈ రాష్ట్రానికి 13 పద్మ అవార్డులు దక్కాయి.
– కేరళను ఈ ఏడాది 8 పద్మ అవార్డులు వరించాయి. ఇందులో పద్మవిభూషణ్ పురస్కారాలు ముగ్గురికి.. పద్మభూషణ్ పురస్కారాలు ఇద్దరికి, పద్మశ్రీ పురస్కారాలు ముగ్గురికి దక్కాయి. గతేడాది మాత్రం ఈ రాష్ట్రానికి 5 పద్మ అవార్డులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి మూడు పెరిగాయి. పైగా ఈసారి ప్రకటించిన మొత్తం 5 పద్మవిభూషణ్ అవార్డుల్లో 3 కేరళ వాసులకే దక్కడం విశేషం
– పశ్చిమ బెంగాల్ కు ఈసారి మొత్తం 11 పద్మ పురస్కారాలు దక్కగా.. ఇందులో అన్నీ పద్మశ్రీలే. 2025లో ఈ రాష్ట్రానికి 9 పద్మ అవార్డులు దక్కాయి. ఈసారి అదనంగా 2 లభించాయి.
– అస్సాం రాష్ట్రానికి గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 5 పద్మ అవార్డులు దక్కాయి.
– తెలంగాణకు 2025లో రెండు పద్మ అవార్డులు దక్కగా.. అందులో ఒకటి పద్మవిభూషణ్, మరోటి పద్మశ్రీ. ఈసారి మాత్రం తెలంగాణ కోటాలో 7 పద్మ అవార్డులు వచ్చాయి.
– ఆంధ్రప్రదేశ్ కు 2025లో 5 పద్మ పురస్కారాలు లభించాయి. ఈసారి 4 దక్కాయి.
ఆ రాష్ట్రాలకు మేలో ఎన్నికలు?
తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం (Assam) సహా పుదుచ్చేరికి ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నది. ఆయా రాష్ట్రాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. నాయకులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమిళనాడు, కేరళ, బెంగాల్ లో పర్యటనలు చేపడ్తున్నారు. వికసిత కేరళం, వికసిత తమిళనాడు, వికసిత బెంగాల్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. బీజేపీ శ్రేణులు కూడా ఈసారి జెండా ఎగరేయాలని గట్టి పోటీ ఇస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్ డీఎఫ్, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. అస్సాంలో బీజేపీ పవర్ లో ఉంది.
బెంగాల్ పై కమలదళం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన తొలి పర్యటన బెంగాల్ లో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇలా.. ఎన్నికల మూడ్ లో ఉన్న రాష్ట్రాలకు ఇప్పుడు పద్మ అవార్డుల్లో ప్రయారిటీ దక్కడంతో సోషల్ మీడియాతో పాటు ప్రతిపక్షాలు తమదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. వీటిని కొందరు ఖండిస్తున్నారు. అవార్డులను (Padma Awards) ఎన్నికలకు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే పురస్కారాలు దక్కుతాయని.. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు ఉండదని బీజేపీ నేతలు అంటున్నారు.
Read Also: పుస్తక నేస్తం అంకెగౌడ.. అక్షర యోగికి అందిన పద్మం
Follow Us On: Sharechat


