epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

ప్రధాని ప్రశంసించిన ‘అనంత నీరు సంరక్షణం’.. ఆ ఇద్దరి కృషే

కలం, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి అనంతపురం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది కరువు. దశాబ్దాలుగా కరువు, వలసలతో నిత్యం వార్తల్లో నిలిచిన ఈ జిల్లా ప్రస్తుతం మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. అయితే, ఈసారి భిన్నమైన రీతిలో కావడం విశేషం. కారణం.. ఈ జిల్లాలో జరుగుతున్న నీటి సంరక్షణను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ‘మన్​ కీ బాత్​’లో ప్రశంసించడమే. కరువును పారదోలేందుకు, నీటి వనరులను మెరుగుపర్చుకునేందుకు ఈ జిల్లాలో జరిగిన, జరుగుతున్న ఓ కార్యక్రమాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే ‘అనంత నీరు సంరక్షణం’(Ananta Niru Sanrakshanam). ప్రధాని మెప్పు పొందిన ఈ కార్యక్రమం, దీని వెనక ఉన్న ఆ ఇద్దరి కృషి ఏంటంటే..

ఆకలి వేటలో వలస బాట..

అనంతపురం.. దశాబ్దాలుగా సరైన వర్షాలు లేక, నీటి ఎద్దడితో సతమతమైన జిల్లా. పంటల సంగతి సరే ఒక్కోసారి తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. పశువులకు మేత ఉండేది కాదు. చేయడానికి పనులు లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టేవి. పిల్లల చదువు ఆగిపోయేది. ముసలివాళ్లు, దివ్యాంగులను ఇండ్ల వద్ద వదిలేసి అందరూ తట్టాబుట్టా సర్దుకొని బెంగళూరుకో, చెన్నైకో వలస వెళ్లేవాళ్లు. ఏ పని దొరికితే ఆ పని చేసేవాళ్లు. ఆ కులం, ఈ కులం.. ఆ మతం, ఈ మతం అని తేడా లేదు. రైతులు, చేనేతలు, రైతు కూలీలు.. అందరిదీ ఆకలి వేటలో వలస బాటే.

అయితే, కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కారణం.. ఆర్డీటీ, టింబక్టు లాంటి స్వచ్ఛంద సంస్థల సహకారం. ప్రభుత్వ చేయూత. అంతేకాదు, కొందరు అధికారులు, సామాజిక సేవకుల కృషి. అలాంటి వాళ్లే.. ఐఎఫ్​ఎస్​ ఆఫీసర్​ వినీత్​ కుమార్​. పర్యావరణ సంరక్షకురాలు రూపక్​ యాదవ్​. వీరిద్దరూ దంపతులు కావడం విశేషం.

నీటి ఎద్దడి పారదోలడానికి ఏం చేశారంటే..

వినీత్​ కుమార్​ .. ఆంధ్రప్రదేశ్​కు 2017 కేడర్​ ఐఎఫ్​ఎస్​ అధికారి. ఐఐటీ గువాహటిలో బీటెక్​ చదివారు. డేటా సైన్స్​ విభాగంలో అమెరికా, బెంగళూరులో ఉద్యోగం చేశారు. అనంతరం ఐఎఫ్​ఎస్​కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కడప డిస్ట్రిక్​ ఫారెస్ట్​ ఆఫీసర్​(డీఎఫ్​వో) గా పనిచేస్తున్నారు. ఈయన సతీమణి రూపక్​ యాదవ్​. వృత్తిరీత్యా ఒకసారి అనంతపురం జిల్లాకు వచ్చిన వినీత్​ కుమార్​.. కరువు కారణంగా అక్కడున్న పరిస్థితులు చూసి ఆలోచనలో పడ్డారు. ఆ కరువును, నీటి ఎద్దడిని పారదోలాలంటే నీటి వసతులు పెంచడమొక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. ఆ పనిలో ఆయనకు రూపక్​ యాదవ్​ అండగా నిలిచారు. వెంటనే ‘అనంత నీరు సంరక్షణం’(Ananta Niru Sanrakshanam) ప్రారంభించారు.

సంప్రదాయ పద్ధతుల్లో..

అనంతపురం జిల్లా సగటు వర్షపాతం 500 మి.మీ లోపే. అందువల్ల వర్షాలు పడినప్పుడు ఆ నీటిని సంరక్షించుకునే అవకాశం ఉండేలా ‘అనంత నీరు సంరక్షణం’ శ్రీకారం చుట్టింది. ఇందులో స్థానికులను భాగస్వాములు చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలను ఎంచుకున్నారు. చెత్తకుప్పలుగా మారిన జలాశయాలను గుర్తించడం, వాటిని బాగు చేయడం ఈ ప్రాజెక్టులో కీలకం. చెత్తను తొలగించి, తిరిగి కాలుష్యం పాలవకుండా కంచెలు ఏర్పాటు చేశారు. చెరువులను లోతుగా తవ్వి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. రాతి బండలతో కట్టలు బలపరిచారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా గ్రావెల్‌, ఇసుక, బండరాళ్లతో బోరు రీచార్జ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే భారీ కుంటల నిర్మాణం, పాత జలాశయాలను పునరుద్ధరణ చేశారు. దాదాపు 11 పెద్ద జలాశయాలను పునరుద్ధరించారు. మొక్కల నర్సరీలు ఏర్పాటుచేశారు. వేలాది చెట్లు నాటారు. చెరువులు, నీటి కుంటల ఏర్పాటు, పునరుద్ధరణ పనులతో స్థానికంగా ఉండే వడ్డెర కులస్థులకు పని కూడా దొరికింది. నీటి వనరుల సంరక్షణతో భూగర్భ జలాలు పెరిగాయి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపించసాగింది.

కళకళలాడుతున్న పల్లెలు..

కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని దాదాపు 400 గ్రామాల్లో ‘అనంత నీరు సంరక్షణం’ జల వనరులను పెంచింది. భూగర్భ జలాలు, పంటల సాగు పెరిగింది. వలసలు తగ్గాయి. పశువులకు మేత దొరికింది. అంతేకాదు, కేవలం నీటి సంరక్షణ మీదే కాకుండా చెట్ల పెంపకంపైనా కూడా దృష్టి పెట్టారు. ఫలితంగా దాదాపు 7వేల మొక్కలను నాటి, వాటిని సంరక్షించడంతో అవి ఇప్పుడు చెట్లుగా మారి పచ్చదనం సైతం పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ వలసలు తగ్గాయి. పల్లెలు జనాలు, పాడిపంటలతో కళకళలాడుతున్నాయి.

‘నీటి వనరులను కాపాడుకుంటే అవి మన బతుకును కాపాడుతాయి. దానికోసం మా వంతు ప్రయత్నం చేశాం. ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ఉంది. నిజానికి ఇది మా కృషి మాత్రమే కాదు’ అంటారు వినీత్​, రూపక్​ దంపతులు.

కాగా, వినీత్​ ప్రస్తుతం కడప ఐఎఫ్​ఎస్​ అధికారిగా అటవీ సంరక్షణకు సైతం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లంకమల అభయారణ్యంలో అరుదైన కలివికోడి సంరక్షణ, అర్బన్​ వనాల ఏర్పాటు వంటివి సమర్థంగా అమలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>