కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఘోర రోడ్డు ప్రమాదం (Madurai Bus Crash) సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధురై సమీపంలోని మేలూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపక్కన నిలిపి ఉన్న మరో బస్సును ఢీకొట్టింది.
త్రిచ్చి–మధురై జాతీయ రహదారిపై కొట్టంపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లపట్టి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. చెన్నై నుంచి మధురైకి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పల్లపట్టి శివారు ప్రాంతంలోని రోడ్డుపక్క టీ స్టాల్ వద్ద ఆగింది. ఈ సమయంలో డ్రైవర్ బస్సు నుంచి దిగిపోయాడు. ఆ సమయంలో చెన్నై నుంచి మార్తాండం వైపు వెళ్తున్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి, నిలిపి ఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో (Madurai Bus Crash) కనగరంజితం (65), సుదర్శన్ (23)తో పాటు గుర్తు తెలియని ఓ మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు బస్సుల్లోని 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంబులెన్సులు, ప్రైవేట్ వాహనాల సహాయంతో గాయపడిన వారిని మధురై, మేలూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మేలూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివకుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం, కొట్టంపట్టి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలను పర్యవేక్షించారు.
Read Also: రూ.లక్ష ఉంటే ఈ మూడింటిలో పెడితే బెటర్.. రాబడి ఎక్కువ..!
Follow Us On: Pinterest


