అత్తను కోడలు దారుణంగా హత్యచేసిన ఘటన విశాఖపట్నం(Visakhapatnam) నగరంలోని జీవీఎంసీ 98వ వార్డులో వెలుగు చూసింది. ఈ ఘటనను అగ్నిప్రమాదంగా నమ్మించేందుకు కూడా సదరు కోడలు ప్రయత్నించింది. చివరకు పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. పిల్లలతో దొంగా, పోలీస్ ఆడుతున్నట్టు డ్రామా ఆడి పక్కా స్కెచ్ తో ఈ హత్య చేసింది కోడలు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖ(Visakhapatnam)లోని అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్‌మెంట్‌లో జయంతి కనకమహాలక్ష్మి (66) తన కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, మనవలతో కలిసి ఉంటోంది. శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కనకమహాలక్ష్మి కాలిపోయి మృతిచెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొదట టీవీ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని కోడలు లలిత నమ్మించింది. అయితే మృతదేహం పరిస్థితి, సంఘటన స్థలంలోని ఆధారాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఆనవాళ్లు ఎక్కడా లభించకపోవడంతో లలితను ప్రశ్నించగా, చివరకు ఆమెే ఈ ఘటనకు కారణమని ఒప్పుకున్నట్లు సమాచారం.
లలిత తన అత్తను కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో బయటపడింది. మంటల్లో అత్త కేకలు వినిపించకూడదనే ఉద్దేశంతో టీవీ వాల్యూమ్ ఎక్కువ చేసి చూసిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఈ దారుణానికి ముందు “హౌ టు కిల్ ఓల్డ్ లేడీ” అనే వీడియోలు కూడా యూట్యూబ్‌లో చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. పిల్లలతో దొంగపోలీస్ ఆడుతున్నట్టు నమ్మించి అత్త చేతులు,కాళ్లు కట్టేసి ఆ తర్వాత కండ్లకు గంతలు కట్టినట్టు తెలుస్తోంది. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించింది. కనకమహాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
Read Also: ఆసియా కప్ ట్రోఫీ కోసం రంగంలోకి ఐసీసీ..
Follow Us on: Instagram

