రాష్ట్రంలోని గ్రామీణప్రాంతాల రహదారులను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాబోయే నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రహదారి అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని వెల్లడించారు. “హ్యామ్ ప్రాజెక్టు కింద రూ.11,399 కోట్లను కేటాయించాం. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభిస్తాం. మొత్తంగా రూ.60,799 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రహదారులు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఇది ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రహదారి ప్రణాళిక” అని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో రోడ్ల పాత్ర కీలకమని కోమటిరెడ్డి అన్నారు. ప్రజలకు సులభంగా రవాణా సదుపాయాలు అందించేందుకు, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయేందుకు ఈ రహదారి ప్రాజెక్టులు తోడ్పడతాయని చెప్పారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. “రూ.10,400 కోట్లతో ఈ రహదారిని 8 లైన్లకు విస్తరించబోతున్నాం. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు ఇది మేలు చేస్తుంది” అని వివరించారు.
రాజధాని పరిసర ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచేందుకు రూ.36 వేల కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, పరిసర పట్టణాల అభివృద్ధికి ఊతమిస్తుందని అన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నామని ఆయన(Komatireddy) హామీ ఇచ్చారు.
Read Also: కశ్మీర్‌లో ఆపరేషన్ పింపుల్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow Us on : Pinterest

