కలం, వెబ్ డెస్క్: ఏపీని ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఐదేళ్లలో ఏపీని అగ్రగామిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కల సాకారం కావాలంటే ప్రజల్లో కూడా ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రవర్తన, అలవాట్లే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని సీఎం పేర్కొన్నారు. ఇల్లు మనదే కాబట్టి ఇంట్లో ఉన్న చెత్తను బయటకు వేస్తామని, కానీ రోడ్డు మనది కాదన్న భావనతో అక్కడ ఉన్న చెత్తను పట్టించుకోమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచన మారాల్సిన అవసరం ఉందని, రోడ్డు కూడా మనదే, రాష్ట్రం కూడా మనదేనన్న భావన ప్రజల్లో బలపడాలని చంద్రబాబు అన్నారు.
స్వచ్ఛత కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఉద్యమంగా మారినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే గత ఏడాది నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర’ (Swachh Andhra) కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రత పెరగడం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని, వాటిని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా మార్చవచ్చని చంద్రబాబు నాయుడు (Chandrababu) విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: టీడీపీలో కోవర్టులున్నారు.. ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)


