epaper
Tuesday, November 18, 2025
epaper

టార్గెట్ హిడ్మా.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కోసం ముమ్మర గాలింపు

మావోయిస్టుల ఉద్యమం దాదాపుగా క్షిణీస్తోంది. కీలక నేతలు భద్రతాబలగాల చేతుల్లో హతమయ్యారు. మరికొందరు లొంగిపోయారు. మావోయిస్టులను లేకుండా చేస్తామన్న కేంద్రప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతున్నట్టే అనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా(Madvi Hidma) అతడి బృందం మాత్రం గట్టి సవాల్ విసురుతోంది. అసలు హిడ్మా ఎక్కడ ఉన్నాడు? అతడి రహస్య స్థావరం ఎక్కడ? అనేది భద్రతాబలగాలకు అంతుచిక్కడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా హిడ్మా కోసం భద్రతాబలగాలు ముమ్మరగాలింపు చేస్తున్నట్టు సమాచారం. హిడ్మా ఇప్పటికే అనేక ఎన్‌కౌంటర్లలో తప్పించుకున్న మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన తీవ్రమైన ఎదురుకాల్పుల నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ సారి మాత్రం పకడ్బందీగా ప్రణాళికలు రచించినట్టు సమాచారం. తెలంగాణ సరిహద్దుకు ఆనుకొని ఉన్న బస్తర్‌ అడవుల్లో సుమారు 2 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించి చుట్టుముట్టారు. ఈ కార్యాచరణలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) వంటి బలగాలు పాల్గొంటున్నాయి.

హిడ్మా ఆధ్వర్యంలోని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్‌ నంబర్‌ 1కి చెందిన ఈ బృందం గత కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో దాడులు, ఆయుధ దాడులు, భద్రతా బలగాలపై దాడులు చేయడం వంటి కార్యకలాపాలతో కలకలం రేపుతోంది. హిడ్మాతో పాటు దేవ్‌, ఎర్ర, కేసా వంటి ఉన్నతస్థాయి గెరిల్లా నాయకులు నేతృత్వం వహిస్తున్న బృందాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని తాజాగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బస్తర్‌ డివిజన్‌లోని దట్టమైన అడవులు, కొండలు, నదులతో నిండిన ప్రాంతాల్లో ఈ బృందం రహస్య శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటుందనే అంచనాతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

అత్యాధునిక సాంకేతికతతో నిఘా

ఈ ఆపరేషన్ కోసం డ్రోన్లు, శాటిలైట్‌ ఇమేజరీ, థర్మల్‌ ఇమేజింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మావోయిస్టులు పట్టు సాధించిన గ్రామాలు, వారి కదలికలు, రహస్య మార్గాలను గుర్తించేందుకు సాంకేతిక మ్యాపింగ్‌ చేపట్టారు. “హిడ్మా(Madvi Hidma) బృందం చివరిసారి తప్పించుకున్న ప్రాంతాల నుంచి సేకరించిన ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఈసారి మరింత కచ్చితమైన ప్రణాళిక రచించినట్టు పోలీసులు చెబుతున్నారు. అబూజ్‌మడ్‌ అటవీప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. ఇక్కడి భూభాగం అత్యంత సంక్లిష్టమైనది. అయితే ఈ ప్రాంతాన్ని కూడా అణువణువు జల్లెడపడుతున్నట్టు సమాచారం.

ప్రధానంగా దక్షిణ బస్తర్‌ పరిధిలోని బీజాపుర్‌, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఈ కార్యాచరణ మొదలైంది. ఈ ప్రాంతాలు మావోయిస్టుల ‘రెడ్‌ కారిడార్‌’లో కీలకమైనవి. గతంలో ఇక్కడే 2021లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు హిడ్మా బృందమే కారణమని అధికారులు ఆరోపిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం బీజాపుర్‌ జిల్లా కేంద్రంలో ఒక హెలికాప్టర్‌ను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచారు. గాయపడిన జవాన్లను తరలించడం, ఆయుధ సామగ్రి సరఫరా, గాలి నుంచి నిఘా వంటి పనులకు ఈ హెలికాప్టర్‌ ఉపయోగపడనుంది. భద్రతా బలగాలు అస్త్రశస్త్రాలతో సరిహద్దు ప్రాంతాల్లో కాపుకాస్తున్నాయి.

ఈ ఆపరేషన్‌ విజయవంతమైతే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిడ్మా దాదాపు 40 ఏళ్ల వయస్సు ఉన్న ఈ నాయకుడు గెరిల్లా యుద్ధ తంత్రాల్లో నిష్ణాతుడు. అతని అరెస్ట్‌ లేదా ఎన్ కౌంటర్ ద్వారా దక్షిణ భారత మావోయిస్టు ఉద్యమంలో కీలక మలుపు తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కార్యాచరణపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా, కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ సన్నిహితంగా పర్యవేక్షిస్తోందని సమాచారం.

Read Also: 4 లక్షల భరణం సరిపోదు ఇంకా కావాలి.. షమీ మాజీ భార్య పిటిషన్

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>