కలం, వెబ్ డెస్క్: అమెరికా(US) అంతటా భారీ మంచు తుఫాను(Snowstorm) తీవ్ర ప్రభావం చూపుతోంది. తీవ్రమైన చలి, భారీగా కురుస్తున్న మంచు ప్రభావంతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించే అవకాశం ఉండటంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ తుఫాను ప్రభావం మొదలైందని వాతావరణ శాఖ తెలిపింది. చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది.
న్యూ మెక్సికో నుంచి తూర్పు తీర ప్రాంతాల వరకు ఈ మంచు తుఫాను ప్రభావం విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే 2,700కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. టెక్సాస్‌లో పెద్ద సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. గతంలో జరిగిన ఘోరమైన విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి విద్యుత్ గ్రిడ్ బలంగా ఉందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోకుల్ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. “ఐదు నుంచి ఆరు నిమిషాలు బయట ఉన్నా ఆరోగ్యానికి ప్రమాదమే” అని ఆమె అన్నారు.
పాఠశాలలు మూసివేస్తున్నారు. క్రీడా పోటీలు వాయిదా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగానే అత్యవసర పరిస్థితి ప్రకటించి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. చలి తీవ్రత (US Snowstorm) కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా అంతటా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సూపర్ మార్కెట్లలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి.
Read Also: అమెరికాలో కుటుంబాన్ని చంపిన భారత సంతతి వ్యక్తి..!
Follow Us On : WhatsApp


