హైదరాబాద్ నగరంలో నత్తన టెన్షన్ నెలకొన్నది. అసలు ఈ నత్తలు ఎక్కడినుంచి వచ్చాయి. ఎలా నివారించాలి? అన్నది టెన్షన్‌గా మారింది. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఆఫ్రికన్ నత్తలు(African Snails) బెంబేలెత్తిస్తున్నాయి. న్యూబోయిన్‌పల్లి సమీపంలోని మిలిటరీ భూభాగంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో కళకళలాడే వనంలో ఈ నత్తలు విపరీతంగా కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నత్తలు విస్తరిస్తే చెట్లు, మొక్కలు, పంటపొలాలు నాశనమయ్యే పరిస్థితి ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రసాయన పిచికారీతో నివారణ
సమాచారం అందుకున్న కంటోన్మెంట్ అధికారులు, పర్యావరణ శాఖ సిబ్బంది సంయుక్తంగా నత్తల నివారణ చర్యలు చేపట్టారు. వనంలోని ప్రహరీ గోడలు, చెట్ల తాళాలు, పుట్టల ప్రాంతాల్లో రసాయన ద్రావణాలు, ఉప్పు నీటిని పిచికారీ చేసి నత్తలను సంహరించారు. అయితే, అవి వందల సంఖ్యలో ఉండటంతో పూర్తి నియంత్రణకు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
పంటలకే కాక పర్యావరణానికీ ముప్పు
ఆఫ్రికన్ జెయింట్ స్నైల్ అనే ఈ జాతి నత్తలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన జాతుల జాబితాలో ఉన్నాయి. ఇవి కూరగాయలు, ఆకులు, చిగుళ్లు, పువ్వులు, తృణధాన్యాలు మాత్రమే కాకుండా వృక్షాల పూతపిందెలను తిని మొక్కలను ఎదగకుండా చేస్తాయి. తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తాయి. ఒక నత్త ఏకంగా సంవత్సరానికి వెయ్యికి పైగా గుడ్లు పెడుతుందన్నది నిపుణుల అంచనా.
హైదరాబాద్‌లో ఇటీవల వర్షాలు, తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నత్తలు వేగంగా పెరుగుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “వీటిని నియంత్రించకపోతే పార్కులు, కాలనీలలో పెంచుకునే మొక్కలు, గార్డెన్ వృక్షాలు సర్వనాశనం అవుతాయి. అంతేకాదు, ఇవి మానవులకు హానికరమైన పరాన్నజీవులను కూడా మోసుకెళ్తాయి”* అని హైదరాబాద్ విశ్వవిద్యాలయ జీవశాస్త్ర విభాగానికి చెందిన నిపుణుడు డాక్టర్ వసంత్‌రావు తెలిపారు.
ఎక్కడి నుంచి వచ్చాయి?
ఈ ఆఫ్రికన్ నత్తలు(African Snails) హైదరాబాద్‌కు ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. బహిరంగ వాణిజ్య మార్గాల్లోని తోటల మొక్కలతో పాటు ఇవి ఇతర రాష్ట్రాల నుంచి చేరి ఉండొచ్చని అంచనా. మునిసిపల్ అధికారులు కూడా ఈ అంశంపై పరిశీలన ప్రారంభించారు. కంటోన్మెంట్‌లో ఘటన బయటపడిన తర్వాత జీహెచ్‌ఎంసీ పర్యావరణ విభాగం కూడా అప్రమత్తమైంది. ప్రజలు తమ ఇళ్ల వద్ద, తోటలలో ఇలాంటి పెద్ద నత్తలు కనిపించినా వాటిని చేతితో తాకవద్దని అధికారులు సూచించారు. ఉప్పు నీటితో పిచికారీ చేయడం, లేదా జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఎండలు ఎక్కువగా ఉంటే వీటి విస్తరణ తగ్గే అవకాశం ఉందని సమాచారం.
Read Also: చీమల భయం.. వివాహిత ఆత్మహత్య
Follow Us on: Youtube

