తల్లి తిట్టిందని, అన్నయ్యతో రిమోట్ విషయంలో గొడవపడి, తండ్రి అడిగిన బైక్ లేదా ఫొన్ కొనివ్వలేదని ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఇటీవల తరుచూ వార్తల్లో వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ వివాహిత చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సదరు మహిళ చీమల ఫోబియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి(Sangareddy) జిల్లా అమీన్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నవ్య కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రీకాంత్, మనీషా దంపతులు ఉంటున్నారు. వారికి ఓ కుమార్తె ఉంది. మనీషాకు చీమలంటే విపరీతమైన భయం. ఇటీవల భర్త మానసిక వైద్యుల దగ్గరకు కూడా తీసుకెళ్లాడు. అంతలోనే సదరు మహిళ ప్రాణాలు తీసుకున్నది.
Sangareddy | ఈ నెల 4న శ్రీకాంత్ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపల నుంచి గడియపెట్టబడి ఉన్నాయి. అనుమానం వచ్చి స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూశాడు. మనీషా చీరతో ఉరి వేసుకొని మృతిచెందినట్లు గమనించారు. సంఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో “చీమలతో వేగలేను” అని ఆమె రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీమల ఫోబియా ఏంటి?
చీమలు చూస్తూ భయపడటాన్ని మానసికశాస్త్ర పరిభాషలో ‘మైర్మెకోఫోబియా’ అంటారు. ఇది ఒక రకమైన స్పెసిఫిక్ ఫోబియా.. అంటే నిర్దిష్టమైన వస్తువు లేదా జీవిపై అసహజమైన భయం కలిగే మానసిక పరిస్థితి. ఈ వ్యాధి ఉన్నవాళ్లకు చీమలు లేదా సదరు వస్తువులు, జంతువులు కనిపించగానే తీవ్ర భయానికి గురవుతారు. హృదయ స్పందన వేగం పెరగడం, చెమటలు, వణుకు, గదిని వదిలి పారిపోవాలన్న ఆలోచన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఫోబియాలు చిన్ననాటి అనుభవాలు, చీమలు కరిచిన భయం లేదా ఆందోళనాత్మక స్వభావం వలన ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
చికిత్స ఏమిటి?
మైర్మెకోఫోబియాను పూర్తిగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఎక్స్పోజర్ థెరపీ వంటి పద్ధతులతో రోగిని క్రమంగా మామూలు మనిషిని చేయొచ్చని నిపుణులు అంటున్నారు. తీవ్రమైన సందర్భాల్లో యాంగ్జైటీ తగ్గించే మందులు కూడా ఇస్తారు. “ఇలాంటి భయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది తర్వాత డిప్రెషన్ లేదా ఆత్మహత్యా ఆలోచనలుగా మారే అవకాశం ఉంటుంది. సమయానికి సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే ఈ ఫోబియాను పూర్తిగా జయించవచ్చు” అని చెప్పారు. భయం లేదా ఫోబియా ఎటువంటి రూపంలో ఉన్నా అది నిర్లక్ష్యం చేయకుండా మానసిక వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: ఒకే ట్రాక్ మీదకు మూడు రైళ్లు.. తప్పిన పెను ప్రమాదం
Follow Us on: Youtube

