కలం,వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala) పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు (Palm Cultivation) ఆశించిన స్థాయిలో లేకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యాలను చేరుకోని కంపెనీల జోన్లను తక్షణమే రద్దు చేసి, ఆసక్తి ఉన్న ఇతర సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ఇప్పటికే కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ప్రైవేట్ కంపెనీల జోన్లను రద్దు చేసి ఆయిల్ ఫెడ్‌కు అప్పగించినట్లు ఆయన గుర్తు చేశారు. విధుల్లో విఫలమైతే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్‌పై కూడా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఆయిల్ పామ్ రైతులపై పెట్టుబడి భారం తగ్గించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సాగు పనిముట్లకు వర్తింపజేయాలని మంత్రి సూచించారు. రైతులకు అవసరమైన బయో ఫర్టిలైజర్లను 50 శాతం సబ్సిడీతో అందించాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఆయిల్ పామ్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుండి 44 శాతానికి పెంచాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర మంత్రులకు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.
మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన జొన్న, మొక్కజొన్న ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా, మంచి ధర ఉన్నప్పుడే టెండర్ల ద్వారా విక్రయించాలని మంత్రి తుమ్మల (Tummala) ఆదేశించారు. ప్రొక్యూర్ మెంట్, స్టోరేజీ విషయాల్లో పాత పద్ధతులు వదిలి కొత్త సాంకేతికతను వాడాలని సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు అన్వేష్ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, సంస్థల ఎండి యాస్మిన్ బాషా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: వేధింపులపై ప్రజలే గుణపాఠం చెబుతారు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Follow Us On: X(Twitter)


