కలం, తెలంగాణ బ్యూరో : ఈ సంవత్సరం మొదటి నెలలోనే తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా ముఖ్యమంత్రి రిక్వెస్టు చేస్తున్న ఐఏఎస్ (IAS) కేడర్ స్ట్రెంత్ అంశంలో ఇది బిగ్ రిలీఫ్. తాజాగా రాష్ట్రానికి చెందిన 16 మంది గ్రూప్-1 అధికారులకు కన్‌ఫర్డ్ ఐఏఎస్ గుర్తింపు లభించింది. వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సంఖ్య 208 కాగా ఇటీవలే పది మందిని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని డీవోపీటీ (DoPT) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కేడర్ స్ట్రెంత్ 218కి చేరుకున్నది. అయితే తాజాగా 16 మంది తెలంగాణ అధికారులు ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడంతో మొత్తం ఆ కేడర్ అధికారులతో సొంత రాష్ట్రానికి చెందినవారి సంఖ్య పెరగనున్నది (Telangana IAS Strength). తెలంగాణ స్ఫూర్తి రిఫ్లెక్ట్ కానున్నది.
ఐఏఎస్‌లలో పెరగనున్న తెలంగాణ ఫ్లేవర్ :
రాష్ట్రం ఏర్పడే నాటికి ఐఏఎస్ కేడర్ స్ట్రెంత్ 163. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెంచాల్సిందిగా గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ (KCR), తాజాగా రేవంత్‌రెడ్డి రిక్వెస్టు చేశారు. పదేండ్లలో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సంఖ్య (Telangana IAS Strength) 208కి పెరిగింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి రిక్వెస్టుతో మరో పది పెరిగి 218కి చేరుకున్నది. మొత్తం పోస్టుల్లో 152 మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. మిగిలిన 66 పోస్టులు స్టేట్ కేడర్ అధికారులతో కన్‌ఫర్డ్ ఐఏఎస్ గుర్తింపు (పదోన్నతి)తో భర్తీ అవుతాయి. అందులో భాగంగా 2022 బ్యాచ్‌లో ఒకేసారి 11 మందికి, 2023 సంవత్సరానికి ముగ్గురు, 2024 సంవత్సరానికి ఇద్దరు చొప్పున కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందారు. 2025 సంవత్సరానికి మరికొద్దిమందికి కూడా ఈ తరహా పదోన్నతి లభించనున్నది. కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందేవారంతా తెలంగాణలో పనిచేస్తున్న గ్రూప్-1 అధికారులే కావడంతో సొంత రాష్ట్రానికి చెందినవారే ఎక్కువగా ఉండే అవకాశమున్నది. చాలా తక్కువ మంది ఏపీకి చెందినవారు ఉండే అవకాశముంది. దీంతో ఐఏఎస్ అధికారుల్లో తెలంగాణ ఫ్లేవర్ గణనీయంగా పెరగనున్నది. తాజా పరిణామంతో తెలంగాణ గ్రూప్-1 అధికారుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర చరిత్రలోనే మైల్‌స్టోన్ : రెవెన్యూ జేఏసీ
డిప్యూటీ తాసీల్దార్లుగా ఎంపికై దీర్ఘకాలం సర్వీసు చేసిన 16 మందికి ఒకే సంవత్సరం బ్యాచ్‌లో ఐఏఎస్‌లుగా పదోన్నతి లభించడం రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన పన్నెండేళ్ళలో ఏనాడూ ఒకే సంవత్సర కాలంలో 16 మందికి కన్‌ఫర్డ్ గుర్తింపు రాలేదని గుర్తుచేశారు. సాధారణంగా గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ కన్‌ఫర్డ్ పదోన్నతి లభిస్తుందని, కానీ ఇప్పుడు గ్రూప్-2 పోస్టులతో డిప్యూటీ తాసీల్దార్లుగా ఉద్యోగంలో చేరి ఐఏఎస్‌లుగా ప్రమోషన్ పొందడం సంతోషాన్ని ఇచ్చే అంశమన్నారు. తాజా ఉత్తర్వులతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: బావబామ్మర్దుల్లో ఎవరి బలమెంత?
Follow Us On: Youtube


