కలం, స్పోర్ట్స్ : ఐసీసీ (ICC) టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ వేదికల విషయంలో బంగ్లాదేశ్ (Bangladesh) మంకుపట్టు పట్టిన విషయం తెలిసింది. భారత్‌లో తమ జట్టుకు భద్రత సమస్యలు ఉన్నాయని, భారత్‌లో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు వేదికలను మార్చాలని ఆ దేశ క్రికెట్ బోర్డ్ డిమాండ్ చేస్తోంది. కాగా ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు తాజాగా పాకిస్థాన్ మద్దతుగా నిలిచింది. బంగ్లాదేశ్ డిమాండ్లను పునఃపరిశీలించాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాసింది. ఈమెయిల్‌ను ఐసీసీ బోర్డు సభ్యులకు కూడా పంపారు. అయితే ఈ చర్య వల్లే బుధవారం అత్యవసర బోర్డు సమావేశం పిలిచారా అన్న విషయంపై స్పష్టత లేదు.
ఐసీసీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే దేశానికి మార్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. భారత్‌తో కలిసి టోర్నమెంట్ సహ ఆతిథ్య దేశమైన శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరుతున్నా షెడ్యూల్ మారదని ఐసీసీ పునరుద్ఘాటించింది. బీసీబీ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు పిలిచిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ విషయం చర్చకు రానుంది. సమస్య పరిష్కారానికి జనవరి 21ను అనధికారిక గడువుగా నిర్ణయించారు. టోర్నమెంట్ ప్రారంభానికి మూడు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది.
గత వారం రోజులుగా ఇరు పక్షాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఢాకాలో జరిగిన సమావేశం కూడా ఇందులో భాగమే. అయినా బంగ్లాదేశ్ (Bangladesh) భారత్‌కు జట్టు పంపలేమని స్పష్టం చేస్తుండగా మ్యాచ్‌లు ముందే నిర్ణయించిన ప్రకారమే జరగాలన్నది ఐసీసీ వైఖరి. ఈ ప్రతిష్టంభనతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఊహాగానాలు పెరిగాయి. బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న ధృవీకరణ లేని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ICC ఇప్పటివరకు అధికారిక స్పందన ఇవ్వలేదు.
Read Also: పంబన్ బ్రిడ్జి.. ఆధునిక రామసేతుకు ఆఖరి వీడ్కోలు
Follow Us On: Youtube


