కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలో అతిపెద్ద బీర్ తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ (AB InBev), తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్‌ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నది. ఈ మేరకు బుధవారం దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో (WEF Summit) కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో తమ సంస్థను విస్తరించేందుకు కంపెనీ ముందుకొచ్చింది.
ఏబీ ఇన్‌బెవ్ (AB InBev) కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్నది. ఈ సంస్థ ద్వారా సుమారు 600 మందికి ఉపాధి పొందుతున్నారు. త్వరలో ఈ యూనిట్ల విస్తరణకు భారీగా పెట్టుబడి పెట్టబోతున్నది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడి లభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఆదాయ వృద్ధి, సామర్థ్య నిర్మాణమే కీలకమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. విధాన స్థిరత్వం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార సౌలభ్యంతో తెలంగాణలో పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలికంగా విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సర్క్యులర్ వాటర్ వినియోగం, మహిళా సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిన సీఎస్‌ఆర్ వ్యయాలు వంటి అంశాల్లో తెలంగాణతో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించారు.
Read Also: పురపోరు.. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
Follow Us On: X(Twitter)


