కలం, వెబ్ డెస్క్ : ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు, బంధువులు గొడవలు పడుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో, నంద్యాల జిల్లా (Nandyal) కు చెందిన ఒక వృద్ధ దంపతులు మాత్రం తమ కోట్లాది రూపాయల ఆస్తిని దేవుడికే రాసి ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. తమ కష్టార్జితం భవిష్యత్తులో ఆధ్యాత్మిక కార్యాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా (Nandyal) ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులకు సంతానం లేదు. తమ తర్వాత ఈ ఆస్తి ఎవరికి చెందుతుందనే ఆలోచన కంటే, అది లోక కల్యాణం కోసం వినియోగపడాలన్నదే వారి ఆకాంక్ష. అందుకే, మాధవరం గ్రామంలో వెలసిన శ్రీరాముల వారి గుడికి తమ ఆస్తిని విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు.
ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉండే తమ స్థిరాస్తులను ఆలయం పేరిట వారు రిజిస్ట్రేషన్ చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, చట్టబద్ధంగా ఆ ఆస్తి స్వామివారికి దక్కేలా అన్ని ప్రక్రియలను పూర్తి చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఆ వృద్ధ దంపతులు మాట్లాడుతూ.. ‘మాకు పిల్లలు లేరు, మా సంపాదన దేవుడి సేవకే వినియోగపడాలని భావించాము. అందుకే ఇష్టపూర్వకంగా మా ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా ఇచ్చాం’ అని వెల్లడించారు.
Read Also: ‘నో వర్క్ – నో పే’.. : ఏపీ స్పీకర్ సంచలన ప్రతిపాదన
Follow Us On: Instagram


