కలం, వెబ్డెస్క్: పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుచేసి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు. ఏడాది కాలంలోనే పసుపు బోర్డు రైతులకు మేలు చేసే ఎన్నో మంచి, మేలు కార్యక్రమాలు చేపట్టిందని ప్రశంసించారు.
పసుపు బోర్డు ఏర్పాటు వెనక రైతుల మూడు దశాబ్దాల పోరాటం, కృషి ఉందని ఎంపీ అరవింద్ (MP Arvind) అన్నారు. దేశవ్యాప్తంగా ఏటా పసుపు ద్వారా రూ.30వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో పసుపు పంట సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే తగ్గిందని, దీనికి ప్రధాన కారణం కూలీల కొరతని ఆయన పేర్కొన్నారు. రైతులు రసాయనాలు వాడడం తగ్గించి, ఆర్గానిక్ సాగు వైపు వస్తే లాభం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం నాణ్యమైన పసుపు విత్తనాలు అందించాలని కోరారు.


